Dil Raju  ఏపీలో టాలీవుడ్ చవిచూస్తోన్న టికెట్ ధరల అంశంపై నాని వంటి హీరోనే గళం విప్పి ధైర్యంగా మాట్లాడగా, కోట్లు సంపాదించుకునే పెద్ద హీరోలు నోరు మెదపకపోవడంపై భారీ స్థాయిలో విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడితే సమస్య ఎంత కఠినతరంగా మారుతుందోనని వేచిచూసే ధోరణిని వహించిన అగ్ర హీరోలను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఎట్టకేలకు ఒడ్డున పడేసారు.

ఇక ఈ విషయంపై టాలీవుడ్ నుండి వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడొద్దని, నిర్మాతలుగా తాము చూసుకుంటామన్న భరోసాను కల్పించారు. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వమే ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని, త్వరలోనే ఏపీలో కూడా సమస్యలు సర్దుమణిగి కొత్త జీవో వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు దిల్ రాజు. దీంతో ఇక ఈ అంశంపై హీరోలు స్పందించాల్సిన ఆవశ్యకత లేకుండా పోయింది.

ఇదిలా ఉండగా, దిల్ రాజు చెప్పిన కొద్దిసేపటికే ప్రభుత్వం నుండి కూడా ఓ ప్రకటన వెలువడింది. హోం ప్రిన్సిపల్ కార్యదర్శి చైర్మన్ గా 10 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా, ఇందులో సినీ గోయర్స్ అసోసియేషన్ నుండి ముగ్గురి ప్రతినిధులకు చోటు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే సీఎం జగన్ అప్పాయింట్మెంట్ లభిస్తే మరింత స్పష్టంగా తమ సమస్యలను చెప్పుకుంటామని చెప్పిన దిల్ రాజుకు త్వరలోనే జగన్ డేట్స్ ఇస్తే సానుకూల పవనాలు పయనిస్తున్నట్లే!

ఇప్పటివరకు నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, త్వరలోనే ఓ పరిష్కారం లభించే దిశగా అడుగులు పడతాయని అంతా భావిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఇటు అభిమానుల్లోనూ, అటు ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సమస్య ఎంత త్వరగా పరిష్కారం అవుతుందోనని ఎదురు చూస్తున్నారు.