While Allu Aravind Is Sceptical, People Will Flock To Cinemas Says Dil Rajuసీనియర్ ప్రొడ్యూసర్స్ – అల్లు అరవింద్ మరియు దిల్ రాజు కరోనా వైరస్ తరువాత సినిమా భవిష్యత్తు గురించి వేరు వేరు అభిప్రాయాలతో ఉన్నారు. అల్లు అరవింద్ డిసెంబర్ లేదా జనవరి నాటికి థియేటర్లను తెరవడం సాధ్యపడుతుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. ప్రేక్షకుల సినిమా చూసే అలవాటులో చాలా మార్పు వస్తుందని, సినీ పరిశ్రమ భవిష్యత్తుపై ఓటీటీ బలమైన ప్రభావాన్ని చూపుతుందని ఆయన అన్నారు.

మరొక వైపు, దిల్ రాజు మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. “ఓటీటీ విడుదలలు సినిమాలపై పెట్టుబడులు పెట్టే డబ్బును ఇవ్వలేవు. వడ్డీలను తట్టుకోగల నిర్మాతలు, తమ ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉన్నవారు థియేటర్లు తెరచే వరకూ వేచి ఉండాలి. థియేటర్లలో సినిమాను ఆస్వాదించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది” అని ఆయన అన్నారు.

దిల్ రాజులా కాకుండా, అల్లు అరవింద్ ఓటీటీ విభాగంలో తన ఉనికిని కలిగి ఉన్నారు. కరోనా మహమ్మారికి ముందు అతను ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. కాబట్టి, అతను ఈ సంక్షోభంలో తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు చిత్రాల అమ్మకాన్ని ప్రేరేపించాలని చూస్తున్నారని కొందరి ఆరోపణ.

అందుకోసమే పబ్లిక్‌లో ఇటువంటి అభిప్రాయాలను ఇస్తున్నాడని వారు అంటున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం… అల్లు అరవింద్ తనకు ఉన్న అనుభవంతో ఇటువంటి సలహా ఇస్తున్నారని, ఇది చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఎంతో అక్కరకు వస్తుందని, ఆయనకు లేనివి ఆపాదించడం తగదని వారు అంటున్నారు.