మన దాకా వస్తే కానీ అర్థం కాదన్నట్టుంది నిర్మాత దిల్ రాజు పరిస్థితి.డబ్బింగ్ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వొద్దు మహాప్రభో అంటూ ఫిలిం ఛాంబర్ నుంచి లోకల్ బయ్యర్ల దాకా అందరూ నెత్తినోరు మొత్తుకుంటున్నా దాని గురించి ఇప్పటికీ పూర్తి స్పష్టత ఇవ్వకుండా ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూతో సరిపెట్టేశారు. సరే ఇంకా నెల రోజులు ఉంది కదా ఏదో ఒక సందర్భంలో వివరణ ఇవ్వకపోరా అని మీడియా సైతం ఎదురు చూస్తోంది. ఇక్కడిలా ఉంటే వారసుడు స్వంత రాష్ట్రంలో రాజుగారికి పెద్ద సవాలే ఎదురవుతోంది. ఒకేసారి అజిత్ తునివు రిలీజ్ అవుతుండటంతో స్క్రీన్లను సమానంగా పంచుకోవాలని అక్కడి ఎగ్జిబిటర్లు కొద్దిరోజుల క్రితం నిర్ణయించుకున్నారు.
దీంతో దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగి తునివుని పంపిణి చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ ని కలుసుకోబోతున్నారు. ఓ తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ కంటే విజయ్ చాలా పెద్ద స్టారని నెంబర్ వన్ అని అందుకే ఒకేలా చూడటం న్యాయం కాదని అదనంగా ఓ యాభై లేదా వంద ఇమ్మని విన్నవిస్తారట. ఇది రెండు రకాలుగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. మొదటిది ఉదయనిధి తమిళనాడు ముఖ్యమంత్రే కొడుకే కాదు స్వయానా తండ్రి క్యాబినెట్ లో మినిస్టర్ కూడా. అధికారంలోకి రాకముందే డిస్ట్రిబ్యూషన్ మీద బలమైన పట్టున్న ఫ్యామిలీ వీళ్లది. రాజుగారు అడగ్గానే సరే తీసుకోండి అనే సీన్ ఉండదు. ఎందుకంటే అజిత్ క్రేజ్ వాళ్లకు కొత్తకాదు.
ఎటొచ్చి విజయ్ నెంబర్ వన్ అనే స్టేట్మెంట్ ఇవ్వడం అక్కడి ఫ్యాన్స్ కి తెలిస్తే మాత్రం ముందు సోషల్ మీడియాలో ఆ తర్వాత బయట రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. హీరోల మీద విపరీత ఆరాధనా భావం చూపించడంలో అరవ సోదరుల ముందు ఎవరూ పనికిరారు. మాములుగానే విజయ్ అజిత్ అభిమానుల గొడవలు పెద్ద స్థాయిలో ఉంటాయి. పరస్పరం కవ్వించుకుంటూ ట్విట్టర్ నుంచి వీధుల దాకా కొట్టుకున్నంత సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వారిసుని హైలైట్ చేయడం కోసం తునీవుని తక్కువ చేస్తే పరిణామాలు తీవ్రంగా అనలేం కానీ సమస్యలు వచ్చేలాగే చేస్తాయి. అసలే ప్రాంతీయాభిమానం ఎక్కువుండే తమిళనాడులో అంత సులభంగా అంగీకరించరు.
సరే వెళ్లి అడిగి వచ్చాక ఎక్స్ ట్రా స్క్రీన్లు ఇస్తారో ఇవ్వరో తర్వాత తేలుతుంది కానీ నా ప్రాధాన్యం తెలుగు సినిమాకే అన్న దిల్ రాజు దానికే కట్టుబడి ఉన్నానని చెబుతున్నారే తప్ప సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల కంటే వారసుడుకి తక్కువ ఉంటాయని చెప్పడం లేదు. అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో అయినప్పుడు ఏపీ తెలంగాణలో విజయ్ కంటే చిరంజీవి బాలకృష్ణ అంతకన్నా పది ఇరవై రెట్లు ఎక్కువ స్టార్ డం ప్లస్ సీనియారిటీ ఉన్నవాళ్లు కదా. ఆ నిజం ఒప్పుకుంటారా. ఇదే నెటిజెన్ల సూటి ప్రశ్న. ఇలాంటివి అడిగినపుడు దాటవేత ధోరణి చూపిస్తున్న దిల్ రాజు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంకొద్దిరోజుల్లో ఓపెన్ అవ్వాల్సిందేగా. చూడాలి ఏమంటారో.