Dil Raju About his involvement in Fidaaటాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’ దిల్ రాజు. ఈయనకే ఎందుకు అన్ని సక్సెస్ లు వస్తాయి అంటే… కధలోని కంటెంట్ ను బలంగా నమ్ముతాడు కాబట్టే వస్తున్నాయి అనేది దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా చెప్పిన మాట. ఇదేమీ కొత్తగా చెప్పిన విషయం కాదు గానీ, అల్లు సైతం అంగీకరించిన అంశంగా “ఫిదా” సంబరాల వేడుక నిలిచింది. కేవలం డబ్బులు పెట్టే నిర్మాతగా కాకుండా, ఒక అభిరుచి గల నిర్మాతగా సినిమాలోని అన్ని కోణాలలో దిల్ రాజు ప్రవేశం ఉంటుంది.

కానీ… శేఖర్ కమ్ముల “ఫిదా” మాత్రం ఇందుకు మినహాయింపు. ఇది స్వయంగా దిల్ రాజు చేసిన ప్రకటనే. సహజంగా తన సినిమాలలో అన్ని విషయాలు తానే దగ్గరుండి చూసుకుంటానని, కానీ “ఫిదా” మాత్రం ‘శేఖర్ కమ్ముల బ్రాండ్’ అని కితాబిచ్చారు. ఈ సినిమాలో తాను వేలుపెడితే మొత్తం “కిచిడి” అయిపోతుందని తనకు తెలుసని, అందుకే ఈ సినిమాకు తాను దూరంగా ఉన్నానని, ఇదే విషయం ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పానని, ఈ సక్సెస్ మొత్తం శేఖర్ కమ్ములకే చెందుతుందని అన్నారు.

‘బొమ్మరిల్లు’ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మా బ్యానర్ కు పేరు తెచ్చిపెట్టిన శేఖర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు రాజు గారు. ‘బొమ్మరిల్లు’ సినిమాకు మొదట కడప నుండి టాక్ వచ్చిందని, ‘ఫిదా’కు నెల్లూరు నుండి ఫస్ట్ టాక్ వచ్చిందని, ఈ క్లాస్ సినిమాకు మాస్ ఆడియన్స్ బ్రహ్మరధం పట్టడంతో సినిమా రేంజ్ మారిపోయిందని, ఇదే విషయం ఫస్ట్ డే సంధ్య ధియేటర్లో చూస్తున్నపుడు కలిగిందని, ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు టాలీవుడ్ సక్సెస్ ‘ఫుల్’ ప్రొడ్యూసర్.