Dil Raju 25th movie mahesh babu వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించబోయే సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి నేటి నుండి షూటింగ్ జరగాల్సి ఉండగా, డెహ్రాడూన్ లో మరో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండడంతో సెక్యూరిటీ కారణాల రీత్యా షూటింగ్ కు అనుమతి లభించలేదు. దీంతో ప్రిన్స్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందోనన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.

వీటికి జవాబిచ్చారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. సుధీర్ బాబు “సమ్మోహనం” సినిమా వేడుకలో పాల్గొన్న దిల్ రాజు… మరో వారంలో 25వ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది అంటూ తీపికబురును అందించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో, పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ను ముగించేయాలని దిల్ రాజు – వంశీ పైడిపల్లిలు నిర్ణయించుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి నాటికి సినిమాను తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా సమాచారం.

మరో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కూడా భాగస్వామి అయిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరుపుకోబోతోంది. సినిమాలో కాసేపు కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోయే ప్రిన్స్ కొత్త లుక్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. దీంతో తమ అభిమాన హీరోను న్యూ లుక్ లో సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పుడు చూస్తామా? అని ప్రిన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే రెండు పాటలను ఈ సినిమాకు అందించేసారు.