DIG Roopa exposes jail perks to Sasikalaఅక్రమాస్తుల కేసులో జైలుపాలైన శశికళకు సంబంధించి ఇటీవల పలు సంచలన విషయాలను మాజీ డీఐజీ రూప వెల్లడించిన విషయం తెలిసిందే. దీని తర్వాత ఆమె, ట్రాఫిక్ బదిలీ కాగా, తాజాగా ఓ తమిళ పత్రిక ‘తమిళ్‌ మురసు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉండాల్సిన శశికళ, వాస్తవానికి అక్కడ ఉండటం లేదని, జైలుకు సమీపంలో ఉన్న ఓ లగ్జరీ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్నట్టు తనకు సమాచారం ఉందని రూప సంచలన విషయాన్ని బయటపెట్టారు.

ఈ అపార్టుమెంటు విషయం తనకు తెలిసి, శశికళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఎన్నో సార్లు ప్రయత్నించానని, కానీ వీలుపడలేదని అన్నారు. ఆమె పట్టుబడి వుంటే తాను తీసుకునే చర్యలు భయంకరంగా ఉండేవని, తన అరోపణలు రుజువైతే… శశికళకు ప్రస్తుతం విధించిన నాలుగేళ్ల శిక్షకు అదనంగా మరికొన్ని సంవత్సరాల శిక్ష తప్పదని అన్నారు. జైల్లో ఆమె ఒక్క పని కూడా చేయలేదని, యాపిల్ ఐ ఫోన్ వాడారని, ఒక్క రోజు కూడా జైలు ఆహారం తినలేదని వెల్లడించారు.

ఖైదీల యూనిఫాంను పక్కన బెట్టి ఖరీదైన చీరలు, చుడీదార్లనే వాడినట్టు ఆరోపించారు. గత వారం నుంచి శశికళకు కల్పించిన అదనపు సౌకర్యాలన్నీ తొలగిపోయినట్టు అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా హల్చల్ చేసింది. అయితే ఒక బాధ్యతాయుతమైన అధికారి అయ్యి ఉండి, రూప చెప్తున్న విషయాలను డిపార్టుమెంటు సీరియస్ గా తీసుకోకపోవడం వెనుక కారణాలు ఏమై ఉండాలి? అలాగే ఉన్నట్లుండి రూప ట్రాఫిక్ బదిలీ కావడం వెనుక ఉన్న కారణం కూడా శశికళపై ఆరోపణలు వ్యక్తం చేయడమేనా? జవాబులు లభించని ఇలాంటి ప్రశ్నలు ఎన్నో… ఎన్నెన్నో…!