Mekapati Rajamohan Reddyకొద్ది రోజుల క్రితం నెల్లూరు తాజా మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నారని ఒక టీవీ ఛానల్ వార్తను ప్రచారం చేసింది. దీనిని మేకపాటి ఖండించారు అయితే ఆయన పార్టీని వీడుతున్నారు అనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కి మేకపాటి కుటుంబం పెద్దదిక్కుగా ఉంది. అయితే ఇప్పుడు వారి హవా తగ్గుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.వారి పని అయిపోయిందని పార్టీలోని వారే అనడం విశేషం.

మీకు వయోభారం ఇబ్బంది ఉంది, ఖర్చు కూడా ఎక్కువ పెట్టడం లేదు, ప్రజావ్యతిరేకత కూడా ఉంది అని జగనే ఆయనకు పలుమార్లు చెబుతున్నారట. ఎంపీ సీటు వదులుకోండి అని డైరెక్టుగా చెప్పకపోయినా ఆ దిశగా సంకేతాలు పంపుతున్నారట. అయితే జగన్ నోటి ద్వారా ఆ మాట వచ్చే వరకు వేచి చూడాలని మేకపాటి భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తనకు ఆఖరి ఛాన్స్‌ ఇవ్వాలని రాజమోహన్‌రెడ్డి జగన్‌ని కోరుతున్నారట. అయితే సర్వేల పేరుతో ఎటూ తేల్చడం లేదట జగన్.

గత ఎన్నికలలో నెల్లూరు పార్లమెంట్ కింద ఉండే అసెంబ్లీ సెగ్మెంట్లలోని అభ్యర్థులకు ధన సాయం చేస్తా అని చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారని కావున ఈసారి ఓ యాభై కోట్ల రూపాయలు ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని జగన్ తన మనుషులతో అంటున్నారంట. ఇది మేకపాటి అవమానంగా భావిస్తున్నారట. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సీటు ఇస్తే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నారట. దీనితో మేకపాటిని వైకాపా నుండి పొమ్మనలేక పొగబెడుతున్నారట.

వైఎస్ కు ఆపుతుడైన మేకపాటి ఆయన మరణానంతరం జగన్ వెంట నడిచేందుకు చాలామంది నేతలు వెనుకంజ వేశారు. మేకపాటి కుటుంబీకులు మాత్రం మొదటినుంచి జగన్‌ని అంటిపెట్టుకున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో చిక్కుకుని జగన్‌ తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడూ ఆయన వెన్నంటే ఉన్నారు. జగన్ కోసం ఒక్కసారి రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళారు. ఇటీవలే మళ్ళీ ప్రత్యేక హోదా కోసం అంటూ మరో సారి రాజీనామా చేసారు. ఇంత చేసినా జగన్ ఇలా ప్రవర్తించడం ఆయనకు మింగుడు పడటం లేదట.