KCR- YS Jaganజగన్, కేసీఆర్ ఎన్నికలలో తమ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడుని ఓడించడానికి కలిసి పని చేశారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. ఆ తరువాత కూడా కొన్ని రోజులు వారిద్దరూ కలిసిమెలిసే ఉన్నారు. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ నీదో దారి నాదో దారి అన్నట్టు అయిపోయింది. ఉమ్మడి ప్రాజెక్టుల ప్రతిపాదనల నుండి ఇప్పుడు కేంద్రం దగ్గర నీటి పంచాయితీ దాకా వెళ్ళింది వ్యవహారం.

తాజాగా రెండు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించడానికి వచ్చేనెల 6న జరగనున్న కేంద్ర జలవనరుల శాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై రేపు నీటిపారుదల శాఖ అధికారులతో కేసీఆర్ చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలని ఆయన చెప్పారట.

తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్దలుకొట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. జలవివాదంలో నిజానిజాలు యావత్ దేశానికి తెలిసేలా చెప్పాలన్నారు. ఈ సమావేశంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అంతరం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరువురు కేంద్రప్రభుత్వంతో సఖ్యత విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

జగన్ బీజేపీ ఏం ప్రతిపాదించినా మారు మాట్లాడకుండా ఒప్పుకుంటుంటే… కేసీఆర్ మాత్రం కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఏమైనా మార్పులు చేసుకుంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.