Andhra_Pradesh_Employees_Unionఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తమ జీతాలు, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడవలసి ఉండగా వారిలోవారే కీచులాడుకొంటూ బజారున పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యానారాయణ నేతృత్వంలో ఆరుగురు నాయకులు గవర్నర్‌ని కలిసి తమ సమస్యలని చెప్పుకొని వినతిపత్రం ఇచ్చి వచ్చారు.

దీనిని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తప్పు పట్టారు. విజయవాడలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యానారాయణ తదితరులు గవర్నర్‌ని కలిసినప్పుడు ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇతర ఉద్యోగ సంఘాల గురించి ఎందుకు మాట్లాడారు?ఏపీ ఎన్జీవో పోరాటలతో జరిగిన కారుణ్య నియామకాల వలననే సూర్యనారాయణకి ఉద్యోగం వచ్చిందనే సంగతి ఆయన మరిచిపోయిన్నట్లున్నారు. ఇప్పుడు ఆయన నేను ఒక్కడినే ఛాంపియన్ అన్నట్లు, మిగిలినవారందరూ దద్దమ్మలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన తీరుని మేము ఖండిస్తున్నాము. త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న సంఘానికి గుర్తింపు రద్దు చేయమని కోరుతాము,” అని అన్నారు.

“ఏపీ ఎన్జీవో సంఘాలు ప్రభుత్వంతో లులూచీ పడ్డాయని చేస్తున్న ఆరోపణలలో నిజం లేదు. ఏపీ ఎన్జీవో సంఘాలు ఎప్పుడూ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాయి. ప్రతీనెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లింపు గురించి ప్రభుత్వానికి గుర్తు చేయవలసిరావడం మాకే సిగ్గుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి మా డీఏ, ఇతర బకాయిలని చెల్లించకుండా తిప్పించుకొంటోంది. త్వరలోనే మేము కార్యాచరణ ప్రకటిస్తాము,” అని బండి శ్రీనివాసరావు అన్నారు.

ఉద్యోగ సంఘాలలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలవర్గంగా ముద్ర పడిన ‘ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య’ అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి కూడా సూర్యనారాయణ బృందం గవర్నర్‌ని కలవడాన్ని తప్పు పట్టారు. ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఉద్యోగుల సమస్యలపై నేరుగా సిఎం జగన్‌తోనే చర్చిస్తున్నప్పుడు సూర్యనారాయణ బృందం గవర్నర్‌ని కలిసి వినతి పత్రం దేనికి? కేవలం పబ్లిసిటీ కోసమే కదా?వైసీపీ ప్రభుత్వంలో వీఆర్ఏలు, ఎండీవోలకి పదోన్నతులు వచ్చాయి కదా? ఉద్యోగుల సమస్యలపై సిఎం జగన్‌ ఇంత సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు గవర్నర్‌ని కలవాల్సిన అవసరం ఏమిటి?ఇటువంటి నేతల తీరుతోనే ఉద్యోగులందరికీ చెడ్డపేరు వస్తోంది,” అని అన్నారు.

ఉద్యోగుల కోసం పోరాడాల్సిన నేతలు తమలో తామే ఈవిదంగా కీచులాడుకొంటుంటే ప్రభుత్వం వారిని ఎందుకు పట్టించుకొంటుంది? వారిని రాష్ట్రంలో ఉద్యోగులందరికీ నేతలుగా, ప్రతినిధులు వారిని ఎందుకు గుర్తిస్తుంది? ఆదిపత్యపోరులో ఉద్యోగ సంఘాల నేతలు బిజీబిజీగా ఉంటే ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎవరు పోరాడుతారు? ఎప్పుడు పోరాడుతారు? వారి ఆధిపత్యపోరు వలన రాష్ట్రంలో ఉద్యోగులందరూ నష్టపోతున్నారు.