Chiranjeevi-Pawan Kalyanముద్రగడ చేస్తున్న దీక్షకు మద్దతు పలికి, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చిరంజీవి మరోసారి తీవ్ర విమర్శల పాలవ్వడంతో రాజకీయాల్లో అసలు చిరు ప్రస్థానం ఎక్కడి వరకు? అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో చిరంజీవితో పోలిస్తే… మెగాస్టార్ సోదరుడు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత మెరుగన్న భావన రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతోంది. వీరిద్దరి ఆలోచనల్లో భారీ వ్యత్యాసం ఉన్నందు వలనే, రాజకీయంగా అభిప్రాయ బేధాలు ఏర్పడి ఉంటాయని పొలిటికల్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ముఖ్యంగా చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ విలీనం సమయంలో, పవన్ కళ్యాణ్ నుండి వ్యతిరేకత వ్యక్తమైందని, అయినప్పటికీ కాంగ్రెస్ లో విలీనం చేయడానికి చిరు మొగ్గు చూపడంతో… అప్పటి నుండి మెగాస్టార్ చేసే రాజకీయాలకు పవన్ కళ్యాణ్ దూరమయ్యారన్నది గతం. ఈ విషయాన్ని కాస్త అటు ఇటుగా పవన్ కూడా ధృవీకరించారు. ‘జనసేన’ ఏర్పాటు నుండి మొన్నటి ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక వరకు… వివిధ సందర్భాలలో పవన్ చేసిన మరొక స్పష్టమైన విషయమేమిటంటే… రాజకీయంగా తన అన్న తనకు ప్రత్యర్దే అని! ‘మా పొలిటికల్ దారులు వేరు’ అని పవన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారో తాజాగా పార్క్ హయత్ హోటల్ లో మెగాస్టార్ పాల్గొన్న ప్రెస్ మీట్ ద్వారా తెలిసి వచ్చింది.

ముక్కుసూటిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ కు ఏ అంశాన్ని అయినా రాజకీయం చేయడం కన్నా… చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరిచడానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ, అదే మెగాస్టార్ గారైతే పరిష్కారం కంటే రాజకీయ లబ్దికే ప్రాముఖ్యత ఇస్తారని మరోసారి రుజువు చేసుకున్నారు. బహుశా తన సోదరుడు చిరంజీవితో ఉంటే, తన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చుకోవడమే కాక, ప్రజల దృష్టిలో ఒక దోషిలా మిగిలిపోతానని భావించారో ఏమో గానీ, ‘జనసేన’ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. ముఖ్యంగా సున్నితమైన విషయాలైన కుల రాజకీయాలలో ఎక్కువగా స్పందించకుండా ఆచితూచే ధోరణితో వ్యవహరిస్తున్న పవన్ పై ప్రశంసలు కురిపిస్తూ, చిరంజీవిని ఏకరువు పెడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా రెట్టింపవుతోంది.

మెగాస్టార్ తన స్థాయిని అంతకంతకూ దిగజార్చుకునేలా ప్రవర్తించడం అవసరమా? ఇప్పటికే ‘కులం’ పేరు పడ్డ చిరంజీవిని ఒక వర్గపు నేతగానే భావిస్తున్నారు. అయితే అసలు గమనించాల్సిన విషయమేమిటంటే… కాపు సామాజిక వర్గపు ప్రజల్లో కూడా చిరు పట్ల అంత సానుకూలత లేకపోవడం విశేషం. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అన్న సిద్ధాంతానికి ‘లైవ్’ ఉదాహరణ చిరు జీవితమే! ఒక రకంగా చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ వైపే కాపు ప్రజానీకం కూడా ఉందని సోషల్ మీడియా మరియు స్థానిక పొలిటికల్ వర్గాల ద్వారా తెలుస్తున్న అంశం. మరి ఎవరి కోసం ఈ పరిపక్వత లేని రాజకీయాలు చిరంజీవి గారు చేస్తున్నారో… కనీసం ఆయనకైనా తెలుసో లేదో అన్న ప్రశ్నలు అభిమాన వర్గాల్లోనూ కలుగుతున్నాయి.