Difference Pawan Kalyan Chiranjeevi, Difference Pawan Kalyan Chiranjeevi Speech, Difference Pawan Kalyan Chiranjeevi Public Meeting Speechశనివారం నాడు తిరుపతి వేదికగా జరిగిన ‘జనసేన’ బహిరంగ సభ విషయాన్ని మరిచిపోదాం..! కానీ, ఈ సభ ప్రారంభం కావడానికి ముందు పవన్ ఏం చెప్తారు? అన్న హడావుడి గురించి కాస్త ప్రస్తావిద్ధాం. అవును… ఈ సభలో అసలు పవన్ ఏం చెప్తారు? ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేస్తారు? కాపుల రిజర్వేషన్ల విషయంలో ఎలా స్పందిస్తారు? అనే రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. మీడియా వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా పవన్ స్పందన కోసం వేచిచూసాయి.

అయితే “ఎందుకు అందరూ అంత ఆసక్తిని ప్రదర్శించారు?” ప్రజల్లో విశేషమైన అభిమాన బలం కలిగిన మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ప్రసంగంపై కూడా ఎప్పుడూ ఆసక్తిని ప్రదర్శించని ప్రజలు, పవన్ పలుకుల కోసం ఎందుకు ఎదురుచూసారో… పవన్ వ్యాఖ్యలే చెప్పాయి. అవును… ‘నేనేం చేసినా మీకు చెప్పే చేస్తాను… ఒకవేళ మీరు కోరుకున్నది చేయలేకపోతే… సిగ్గు పడకుండా మిమ్మల్ని క్షమించమని అడుగుతాను, అంతేగానీ, దొంగచాటు వ్యవహారాలకు తావు ఇవ్వను’ అన్న నిజాయితీ, నిబద్ధతతో కూడిన వ్యాఖ్యలే… అశేషమైన ప్రజల ఎదురు చూపులకు కారణం.

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేసి దాదాపుగా ఒక దశాబ్ద కాలం కావస్తోంది. ఇప్పటివరకు పవన్ ఇచ్చిన స్పీచ్ ల మాదిరి కనీసం ఒక్కటైనా ఉందా? అంటే నోరెళ్ళబెట్టాల్సిందే..! ‘ఎందుకు ఇవ్వలేకపోయారు…’ అన్న దానికి జవాబు కావాల్సి వస్తే… ‘కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు’ అన్నట్లు… చిరుకు-పవన్ కు ఉన్న ‘చిత్తశుద్ది’కి కూడా అన్నే కారణాలుగా మిగులుతున్నాయి. మెగాస్టార్ రాజకీయ రంగప్రవేశం చేసిన లక్ష్యం ‘విలీనం’తో ముగిసిపోయిందని, ఇప్పుడు ఉన్నదంతా ‘బోనస్’ అంటూ పొలిటికల్ వర్గాల్లో మెగాస్టార్ చిరంజీవిపై పడుతున్న కౌంటర్లకు కొదవలేదు. నిజానికి ఈ వ్యాఖ్యలను ‘కౌంటర్లు’ అని సంభోదించే కంటే… అసలు ‘వాస్తవం’ ఇదేనని చెప్పవచ్చు.

ప్రజల కోసం పోరాడడానికి ఒక వ్యక్తి తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని ప్రజలు ఆశిస్తున్నారు. మరి ఇదే ఊపుతో తన నిజాయితీని పవన్ కళ్యాణ్ నిరూపించుకుని, అన్నకు తగ్గ తమ్ముడి కాదు… ప్రజాసేవలో ‘అన్నను మించిన తమ్ముడ్ని’ అని చాటిచెప్పాలని అభిమానగణంతో పాటు సామాన్య ప్రజలు ఆశిస్తున్నారు.