Nara_Lokesh_Jaganటీడీపీ యువనాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నేడు 110వ రోజున కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గంలో 1,400 కి.మీ. మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పెద్దముడియం మండలం, నిమ్మలదిన్నెలోని గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు ఉపాధి కల్పించేందుకు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని గ్రామస్తులకు ఇచ్చిన హామీని శిలాఫలకంపై వ్రాయించి ఆవిష్కరించారు.

జనవరి 27 వ తేదీన కుప్పం నియోజకవర్గంలో తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్, ఇప్పటివరకు 1411.40 కిమీ నడిచారు. ఈరోజు పాదయాత్రలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. రెండూ కూడా నారా లోకేష్‌కు సమాజం పట్ల గౌరవాన్ని సూచించేవే కావడం విశేషం.

ఈరోజు దారిలో పెద్దపసుపుల చావిడి వద్ద గ్రామపెద్దలతో సమావేశమైనప్పుడు వారిలో ఓ పెద్దాయన నారా లోకేష్‌ని ఉద్దేశ్యించి “సార్…” అంటూ ఏదో చెప్పబోతే నారా లోకేష్‌ వెంటనే అయన మాటలకు అడ్డు తగులుతూ, “నేను వయసులో మీకంటే చాలా చిన్నవాడిని… కనుక మనుమడని పిలవండి లేదా లోకేష్ అని పేరు పెట్టి పిలవండి. అంతే కానీ సార్ సార్ అంటూ నన్ను మీకంటే పెద్దవాడిని చేసేయకండి…” అని విజ్ఞప్తి చేశారు. తాము నిరుపేదలైనప్పట్టికీ నారా లోకేష్‌ తమకు ఇంత గౌరవమిచ్చి మాట్లాడటంతో సమావేశానికి వచ్చిన వారందరూ చాలా సంతోషించారు. అప్పుడు ఆ పెద్దాయన రెండు చేతులతో నారా లోకేష్‌ని చల్లగా ఉండమని దీవిస్తూ “అలాగే బాబు…” అంటూ తన సమస్యను చెప్పుకున్నారు.

నారా లోకేష్‌ ఏ గ్రామంలో పాదయాత్ర చేస్తున్నా ఆయనకు సంఘీభావం తెలుపుతూ గ్రామస్తులు ఊరి పొలిమేర వరకు ఆయనతో కలిసి నడుస్తుంటారు. ఈరోజు కూడా అలాగే నారా లోకేష్‌ వెంట చాలా మంది వెంటనడుస్తున్నారు. వారిలో ఓ బాలుడు టిడిపి చొక్కా ధరించి కనబడ్డాడు. నారా లోకేష్‌ అతనిని దగ్గరకు పిలిచి, “నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి… చక్కగా స్కూలుకు వెళ్లి చదువుకో… ఇప్పటి నుంచే నీకీ రాజకీయాలు ఎందుకు?” అంటూ ఆ చొక్కా తీసేసి పంపించేశారు. ‘పిల్లలు బడిలో ఉండాలి… పెద్దవాళ్లు పనిలో ఉండాలి,’ అంటూ నారా లోకేష్‌ ముందుకు సాగారు జనం వెంట రాగా!

ఈ సందర్భంగా ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనల గురించి ఓ రెండు ముక్కలు చెప్పుకోవలసి ఉంటుంది. జగన్ జిల్లా పర్యటనలు వస్తే విద్యార్ధుల చేత స్వాగతం పలికిస్తారు. ‘బటన్ నొక్కుడు’ సభలలో విద్యార్థుల చేత పొగిడించుకొంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. నారా లోకేష్‌, జగన్మోహన్ రెడ్డి ఇద్దరిలో ఎంత వ్యత్యాసం కనిపిస్తోందో కదా?

ఈ నెల 27,28 తేదీలలో రాజమహేంద్రవరంలో టిడిపి మహానాడు సమావేశాలు జరుగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు నారా లోకేష్‌ తన యువగళం పాదయాత్రకు నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మధ్యాహ్నం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు. ఈరోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకొన్న తర్వాత రేపు ఉదయం రాజమహేంద్రవరానికి బయలుదేరి వెళతారు. మహనాడు ముగిసిన తర్వాత మంగళగిరి వచ్చి అక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూస్తారు. మళ్ళీ మే 30వ తేదీన జమ్మలమడుగులో ఎక్కడ పాదయాత్ర ఆపేశారో అక్కడి నుంచే తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు.