difference between nandamurifans mega fansఇటీవల కాలంలో ‘మెగా’ వృక్షం క్రింద ఉన్న ‘పవర్ స్టార్’ అభిమానులు చేస్తున్న “ఓవరాక్షన్”తో ఆడియో వేడుకలన్నీ రసాభాసగా ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఆయా వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిధులను మాట్లాడనివ్వకుండా చేయడంలో పవన్ అభిమానులు చూపిస్తున్న ఉత్సుకత పలు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే వారంతా “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుకకు హాజరైన ప్రేక్షకులను చూసి నేర్చుకోవాలని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.

“నాన్నకు ప్రేమతో” వేడుకలో ముఖ్య అతిధిగా విచ్చేసిన తారక్ తండ్రి హరికృష్ణ చాలా సుదీర్ఘ ప్రసంగం చేసారు. ఆడిటోరియంలో కూర్చుని చూస్తున్న వీక్షకులకు ఎలా ఉందో గానీ, బుల్లితెరపై హరికృష్ణ ప్రసంగాన్ని చూసిన వారంతా అవాక్కయ్యారు. సాధారణంగా ఈ స్థాయి ప్రసంగాన్ని హరికృష్ణ ఎప్పుడూ వినిపించరు. బహుశా ఇదే ప్రసంగం పవన్ అభిమానుల ముందయితే ఖచ్చితంగా సాధ్యపడేది కాదని చెప్పవచ్చు. అంతటి సుదీర్ఘ ప్రసంగానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా అభిమానులు శ్రద్ధగా ఆలకించారు.

అంతకుముందు ‘మ్యాన్లీ స్టార్’ జగపతిబాబు వ్యాఖ్యానించినా… అలాగే ఆ తర్వాత ‘సంగీత తరంగం’ దేవిశ్రీప్రసాద్ మరో సుదీర్ఘ ప్రసంగం వినిపించినా… క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఇంకాస్త సమయం తీసుకున్నా… ఒక్కసారి కూడా అభిమానుల నుండి వారి వారి ప్రసంగాలకు అడ్డు తగలకపోవడం చూస్తుంటే… నిజంగా శిల్పకళావేదికకు హాజరైన అభిమానులకు “హ్యాట్సాఫ్” చెప్పాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ ఆడియో వేడుక టాలీవుడ్ లో ఓ కొత్త ఒరవడికి నాంది పలికిందని, ముఖ్యంగా అభిమానులు ప్రవర్తించిన విధానం అందరికీ (ప్రధానంగా పవన్ అభిమానులకు మాత్రం) ఆదర్శప్రాయంగా నిలుస్తుందని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ఆడియో విడుదల’ లాంటి బహిరంగ వేడుకలపై అతిధులను ఎలా గౌరవించాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికైనా నేర్చుకోవాలన్న వ్యాఖ్యలు విశ్లేషకుల నుండి వస్తున్నాయి. వీరిలో ఎంత మార్పు సంభవించిందో లేదో తెలియాలంటే మరో ‘మెగా’ వేడుక సిద్ధం కావాల్సిందే. అసలు మార్పు వస్తుందంటారా..?