MS-Dhoni---Virat-Kohliమహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో టీమిండియా వెలిగిపోయింది అన్నది ఎంత వాస్తవమో, గత కొన్నాళ్ళుగా అదే స్థాయిలో ఓటమి పాలవుతోంది అన్నది కూడా అంతే వాస్తవం. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా… సంయమనాన్ని కోల్పోని ధోని, ఇటీవల కెప్టెన్సీకి రాజీనామా చేయగా, అది కాస్త విరాట్ కోహ్లికి వెళ్ళడం తెలిసిందే. తాజాగా విరాట్ ఖాతాలో మొదటి సిరీస్ విజయం కూడా దక్కింది. ఆడిన రెండు మ్యాచ్ లలో అద్వితీయమైన విజయాలు సాధించిన కోహ్లిని పొగడ్తలలో ముంచెత్తుతున్నారేమో గానీ, కెప్టెన్ గా మాత్రం కాదనే చెప్పాలి.

ముఖ్యంగా ‘కెప్టెన్ కూల్’ అంటూ పేరు తెచ్చుకున్న ధోని నాయకత్వాన్ని చూసిన కళ్ళతో, కోహ్లి కెప్టెన్సీని చూసి జీర్ణించుకోవడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుందని చెప్పకతప్పదు. ముఖ్యంగా కటక్ వేదికగా జరిగిన రెండవ మ్యాచ్ లో ధోని – కోహ్లి కెప్టెన్సీ మధ్య తారతమ్యం ఏమిటో ప్రేక్షకులకు స్పష్టంగా తెలిసి వచ్చింది. మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 381 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు ధాటిగా ఆడుతూ లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో కెప్టెన్ గా కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ముఖ్యంగా బంతి అందించిన ప్రతి బౌలర్ తో మంతనాలు జరపడం, ప్రతి బంతికి ఏదో ఒక సూచన ఇస్తూ వారిపై మరింత ఒత్తిడి పెంచడంతో… కొన్ని బంతులు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో బౌలర్లతో చర్చించి, ధోనీ ఫీల్డర్లను మార్చేవాడు. బౌలర్ ఎలాంటి బంతులు వేయాలనుకుంటున్నాడో తెలుసుకుని, తదనుగుణంగా ఫీల్డర్స్ ను మోహరించేవాడు తప్ప, ఎక్కువగా బౌలర్లపై ఒత్తిడి తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేసేవాడు కాదు.

అలాంటి ప్రయత్నమేదీ చేయని కోహ్లీ, భావోద్వేగాలను నియంత్రించుకోకుండా, ఎవరైనా బౌలర్ మిస్ ఫీల్డ్ చేస్తే మైదానంలో చాలా చిరాకుగా స్పందిస్తున్నాడు. ఒకసారి ధోనీ బంతిని వదిలేసినప్పుడు కూడా కోహ్లీ గట్టిగా అరవడం విశేషం. కెప్టెన్ కూల్ గా ఉన్నపుడే ఆటగాళ్ళు కూడా తమ అత్యుత్తమమైన ప్రదర్శన ఇస్తారు అన్నది గతంలో నిరూపణ అయిన విషయం. అలా కాకుండా హాట్ హాట్ గా చర్చలు చేసి, ఎక్స్ ప్రెషన్స్ ఇస్తే… అది పరిపక్వత లోపంగానే కనపడుతుంది తప్ప… మంచి నాయకత్వం అనిపించుకోదు. ఒక బ్యాట్స్ మెన్ గా సచిన్ టెండూల్కర్ ఎన్ని అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టినా… కెప్టెన్ గా దారుణంగా విఫలమయ్యాడు. విరాట్ కోహ్లి మాత్రం అలా కాకూడదు అని మాత్రమే సగటు క్రికెట్ అభిమాని ఆవేదన.