Chiranjeevi Balakrishnaగత రెండు, మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ జీవితాలు తెరిచిన పుస్తకాలే. వీరిద్దరి వ్యక్తిత్వాలు అభిమానులతో పాటు సామాన్య ప్రజలకు కూడా స్పష్టమైన అంశమే. అయితే చిరు, బాలయ్యల వేదికగా ఆ రెండు కుటుంబాలలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మరోసారి ఆ ఇద్దరి వ్యక్తిత్వాలను చర్చనీయాంశం చేసాయి.

ముందుగా… మెగాస్టార్ విషయానికి వస్తే, తన 150వ సినిమా అంటూ ఏడెనిమిది ఏళ్ళుగా తాత్సారం చేస్తూ వస్తున్న ఉదంతం తెలిసిందే. అలాగే ఆడియో ఫంక్షన్ వంటి వేదికలపై ‘పవన్’ నినాదం మారుమ్రోగుతున్నపుడు చిరు పడిన ఇబ్బందులు ‘బుల్లితెర’ సాక్షిగా బహిర్గతమైన విషయమూ తెలిసిందే. ఇవి కాక, రాజకీయ పరంగా అధికారంలో ఉన్నపుడు గానీ, రాష్ట విభజన సమయంలో గానీ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నపుడు గానీ చిరు వ్యవహారశైలి వీరాభిమానులకే మింగుడు పడని అంశంగా తయారైంది.

తన చేతిలో ఉన్నటువంటి 150వ సినిమా గురించి ‘దైవాధీనం’ అంటూ కొన్నాళ్ళు ప్రస్తావించిన చిరు, ఇటీవల ఆ ప్రకటనల బాధ్యతను తన తనయుడు రామ్ చరణ్ కు అప్పగించారు. చిరు 150వ సినిమా “కత్తి” రీమేక్ అని చెర్రీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పవన్ ‘నినాదం’పై మరో మెగా బ్రదర్ నాగబాబును తెరపైకి తీసుకువచ్చారు. చిరు పుట్టినరోజు వేడుకల్లో నాగబాబు వినిపించిన ‘స్వరం’ మెగాస్టార్ దేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!

ఇక, పోలిటిక్స్ కు వచ్చేసరికి “ప్రజారాజ్యం” పార్టీ విషయంలో మరియు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం సందర్భంలో అల్లు అరవింద్ టార్గెట్ కాగా, ఒక్కసారి కేంద్రమంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రజలకు మెగాస్టార్ ఏకంగా ‘ఫేస్ టర్నింగ్’ ఇచ్చేసారు. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా చిరు గురించి ప్రస్తావించక పోవడం ఉత్తమమేమో! ఇవి కాక, చిరు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తీసుకుంటే, తన చిన్న కూతురు శ్రీజ వివాహ సమయంలో గానీ, ఉదయ్ కిరణ్ తో పెద్దకూతురు వివాహ నిశ్చితార్థ సమయంలో గానీ పవన్ కళ్యాణ్ పేరు ఎంతలా వినిపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా.. సందర్భం ఏదైనా గానీ చిరు డైరెక్ట్ గా “కుండబద్ధలు” కొట్టిన ఉదంతాలు లేవు.

మరోవైపు చిరుకు సమకాలీకుడైన బాలకృష్ణ మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైన వ్యవహారశైలితో ముందుకెళ్తున్నారు. కుటుంబ విషయాల్లో గానీ, పార్టీకి సంబంధించిన అంశాల్లో గానీ అందరి కంటే ముందు బాలయ్యే ఉంటారు. ఏ అంశాన్నైనా ‘కుండబద్ధలు’ కొట్టినట్లు చెప్పడంలో బాలయ్యకు మరెవరూ సాటిరారు. గతంలో కృష్ణాజిల్లా వేదికగా వెలిసిన “ఫ్లెక్సీ” రాజకీయాల సమయంలో బాలయ్య ఇచ్చిన “వార్నింగ్” బహుశా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు మరచి ఉండరు. అలాగే ఇటీవల సినిమాల పోటీ విషయంలో బాలయ్య చేసిన “స్పష్టమైన” ప్రకటన, ఖచ్చితంగా చిరు వల్ల అయితే సాధ్యపడేది కాదని చెప్పవచ్చు.

తన అభిప్రాయాలన్నీ ఎవరో ఒకరి ద్వారా ప్రజలకు చేరవేసే స్వభావాన్ని చిరు కలిగి ఉండగా, ఎలాంటి ప్రకటన అయినా గానీ అదురు బెదురు లేకుండా అంతా తానే చేసే వ్యక్తిత్వం బాలయ్య సొంతం. చిరు అనుసరిస్తున్న విధానాల వలన… తన స్థానంలో ఎవరో ఒకరు వివాదాల్లోకి వచ్చే అవకాశం ఉండగా, బాలయ్య అనుసరిస్తున్న విధానం ఆయన వ్యక్తిత్వాన్ని చాటిచెప్తోంది. “డిక్టేటర్” ఆడియో ప్లాటినం డిస్క్ వేడుకలో బాలయ్య చేసిన ప్రకటనల తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని, చిరుతో పోల్చుతూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున చర్చకు దారితీసారు.