arun-jaitley-narendra-modiప్రత్యేక హోదా… ప్రత్యేక ప్యాకేజ్… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఇద్దరు కలుసుకున్నా చర్చించుకునే ప్రధాన అంశంగా మారిపోయింది. అయితే వీటిపై ప్రజలలో ఎంతవరకు అవగాహన ఉందనేది పక్కన పెడితే, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ప్రజలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చేయగా, ఇవ్వకుండా తప్పించుకోలేరని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. మరో వైపు హోదాకు ‘మించి’ ఇస్తామని కేంద్రం స్పష్టం చేస్తోంది. అసలు హోదా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమిటి? ప్యాకేజీ వల్ల పోయేదేమిటి? అనే ప్రశ్నలను పరిశీలిస్తే…

ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో తిరిగి కొంత భాగాన్ని ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కింద రాష్ట్రాలకు చెల్లిస్తుంది. మోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక వ్యయం ఊసెత్తడం మానేశారు. దీంతో హోదా ఉన్న రాష్ట్రాలకు అందే 30 శాతం నిధులు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా హోదా ఉన్న రాష్ట్రాలు, లేని రాష్ట్రాల మధ్య పెద్దగా తేడా ఉండదు. ఇదే విషయాన్ని 14వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఇప్పటి వరకు హోదాను అనుభవిస్తున్న రాష్ట్రాలకు కూడా ఇక నుంచి ప్యాకేజీ మాత్రమే లభిస్తుంది. దీనికి తోడు ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది.

హోదా ఉన్న 11 రాష్ట్రాలతో పాటు ఏపీ, బెంగాల్, కేరళకు కూడా ఈ నిధులు ఇచ్చారు. ఏపీకి ఐదేళ్లలో 22,500 కోట్లు కేటాయించారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ప్రణాళిక వ్యయం కింద అదనంగా నిధులు అందుతాయి. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక నిధుల్లో 30 శాతాన్ని ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పంపిణీ చేశారు. మిగతా 70 శాతాన్ని మిగతా రాష్ట్రాలకు పంచుతారు. 1968 నుంచి ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలున్నా 2002లోనే పన్ను రాయితీల అంశం తెరపైకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని అమలులోకి తీసుకొచ్చారు. అది కూడా ఐదేళ్లపాటే!

2005లో ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌ లకు పన్ను రాయితీలిచ్చారు. మొదట ఐదేళ్ల పాటు ఇచ్చిన తర్వాత ఒకసారి ఐదేళ్లు, మరోసారి రెండేళ్లు చొప్పున పెంచారు. 2014 తర్వాత హోదా ఉన్న 8 రాష్ట్రాల్లో మినహాయింపులు ఆగిపోగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌ లకు 2017లో ఆగిపోనుంది. ఫలితంగా దేశం మొత్తం ఒకే పన్ను రాయితీ ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం, చౌహాన్ కమిటీ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఇక ‘ముగిసిన చరిత్ర’ అని కేంద్రం వాదిస్తోంది. అందుకే హోదాకు సమానంగా సాయం చేస్తామని ప్రకటించింది.

ఏపీకి ప్యాకేజీ ఐదేళ్ల పాటు కొనసాగుతుందని… ఫలితంగా ఏపీకి రుణం రూపంలో 22,500 కోట్లు, మధ్యకాలిక రుణంగా 22,500 కోట్లు కలిపి మొత్తం 45 వేల కోట్లు వస్తాయి. ఇదేమీ తక్కువ మొత్తం కాదన్నది కేంద్రం వర్గాల వాదన. అయితే రాజ్యసభలో ప్రధాని ఇచ్చిన హామీకే విలువ లేని వేళ, చట్టబద్ధత లేని జైట్లీ ప్రకటనకు విలువేంటన్నది కొందరిని వేధిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే అనుమానంతో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.