Sarrainodu- A aamovieపవన్ కళ్యాణ్ పై వివరణ ఇచ్చుకున్న సమయంలో అల్లు అర్జున్ ఒక మంచి మాట చెప్పారు. ప్రస్తుతం తానూ చాలా జాగ్రత్తగా మాట్లాడాలని… సక్సెస్ ఉన్న సమయంలో మాట్లాడితే వీడికి ఎక్కువైందంటారు… కాబట్టి ఆచితూచి మాట్లాడుతున్నాను అని అన్నారు. నిజమే అల్లు అర్జున్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఊహించని విజయాలు సొంతమైనపుడు హీరోలు, దర్శకులు, నిర్మాతలు… ఒకరేమిటిలే… ఏదొక సందర్భంలో ‘టంగ్ స్లిప్’ అవ్వడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. నిజానికి వివరణ ఇవ్వకముందు, ఇచ్చిన తర్వాత కూడా బన్నీని ఇలాగే భావించడంతో, సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది ఆ ఉదంతం.

అయితే బాక్సాఫీస్ వద్ద మరే ఇతర సినిమా లేకపోవడంతో బన్నీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా… ఈ ప్రభావం ‘సరైనోడు’పై పడలేదు. ఇప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ‘సరైనోడు’కు బ్రేకులు పడేలా చేసింది ‘అ…ఆ…’ సినిమా ఫలితం. అయితే బన్నీ మాదిరి హీరో నితిన్ ఎక్కడా ‘టంగ్ స్లిప్’కు అవకాశం ఇవ్వలేదు. అంతేకాక, ఈ సక్సెస్ నంతా దర్శకుడు త్రివిక్రమ్ కే ఇచ్చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘సరైనోడు’ మాదిరే ‘అ…ఆ…’ విజయం కూడా ఊహలకందనిది.

ఇప్పటివరకు హీరో నితిన్ మార్కెట్ కేవలం 20 కోట్లు మాత్రమే. అలాంటి నితిన్ ఏకంగా 50 కోట్ల వైపుకు దూసుకెళ్ళడమనేది సామాన్యమైన విషయం కాదు. స్టార్ హీరో రేంజ్ వాళ్ళ వరకే పరిమితం అనుకున్న 50 కోట్ల క్లబ్ ను ఒక యువ హీరో కూడా అవలీలగా అందుకోవడం అనేది సినీ పరిశ్రమకు మంచి పరిణామం. అంతేకాదు తామూ మాత్రమే ‘రూలర్స్’ అనుకునే స్టార్ హీరోలకు చెంపపెట్టు లాంటిది ‘అ…ఆ…’ విజయం. అయితే ‘సరైనోడు’ మాదిరి ‘అ…ఆ…’ ప్రమోషన్స్ లో ఎక్కడా ‘కలెక్షన్స్’ ప్రస్తావన లేదు… కేవలం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బన్నీ కలెక్షన్స్ ప్రచారం వెనుక ఒక ప్రత్యేకమైన “లక్ష్యం” ఉన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ రెండు సినిమా విజయాలతో ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే… సహజంగా సినిమాను క్లాస్, మాస్ అంటూ విభజన చేసి విశ్లేషిస్తుంటారు. కానీ, బన్నీ మాస్ మూవీగా వచ్చినా… నితిన్ క్లాస్ సినిమాగా వచ్చినా… ఆ ఇద్దరు హీరోలకు మించిన రేంజ్ లో కలెక్షన్స్ ను అందించారు ప్రేక్షకులు. అయితే బన్నీ ఎపిసోడ్ వలన ‘సరైనోడు’కు మరింత ప్రచారం కలిగి హాట్ టాపిక్ అయ్యారు. నితిన్ మాత్రం సైలెంట్ గా సక్సెస్ సంబరాలు గుంటూరులో చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.