Mayawati denied appointment to pawan kalyan -రాజకీయ నాయకులకు ఆవేశంతో పాటు విచక్షణ కూడా ఉండాలి. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి సవాలు విసిరారు. దమ్ముంటే కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి నేను ఢిల్లీ వెళ్ళి అన్ని పార్టీలను కలిసి మద్దతు కూడగడతా అని చెప్పారు.

జగన్ అవిశ్వాసం పెట్టారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్ అయిపోయారు. జాతీయ నాయకుల మద్దతు అటుంచి వారిని కలవడం కూడా కష్టమే. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ తెలివిగా తప్పుకున్నారు. అయితే ఆ తప్పు ఇప్పుడు చేశారు. నిన్న ఆయన ఉన్నఫళంగా నాదెండ్ల మనోహర్ ను వెంటబెట్టుకుని లక్నోలో దిగిపోయారు.

నాదెండ్ల మనోహర్ తోపాటు దళిత వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, ఉస్మానియా విద్యార్థులను కూడా తీసుకెళ్లారు. అక్కడ మాయావతితో పాటు.. బీఎస్పీ అగ్రనేతలతో చర్చలు జరుపుతారని.. కాపు – దళిత సమ్మేళనంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలలో చక్రం తిప్పుతారని. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ లేని ఫ్రంట్ ను స్థాపించడానికి ఇది మొదటి అడుగు అని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి.

పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లిన తర్వాత మాయవతి… తన పార్టీ జనరల్ సెక్రటరీని కలిసి వెళ్లమని చెప్పేశారట. దాంతో నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్.. బీఎస్పీ జనరల్ సెక్రటరీ మిశ్రాను కలిసి వచ్చేశారు. కనీసం ఆ పార్టీ ఎంపీ కూడా కలవలేదట. దీనితో పరువుపోయినట్టుగా అయ్యింది.

సహజంగా రాజకీయ నాయకులు అపాయింట్‌మెంట్ ఖరారు చేసుకున్న తర్వాతే ఇలాంటి పర్యటనలకు వెళ్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పులో కాలేశారో! లక్నో పర్యటన ప్లాప్ కావడంతో పవన్ అక్కడి అంబేద్కర్ పార్క్‌లో దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. మ్యూజియాన్ని సందర్శించారు. అలా… పార్క్ మొత్తాన్ని కాలినడకన సందర్శించిన రెండో వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమే అని జనసేన ప్రత్యేకంగా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది.