Did KTR call BJP leader and ask for helpతెలంగాణ మంత్రి, టిఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సంబందించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇంతకీ అదేమిటంటే, ఆయన తన ప్రత్యర్ధ బిజెపికి చెందిన జగన్నాధం అనే ఓ సీనియర్ నేతకు ఈరోజు ఫోన్‌ చేసి, మునుగోడు ఉపఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు సహకరించమని అభ్యర్ధించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌ ఉపఎన్నికలకు ముందు ఇటువంటి రాజకీయ తప్పిదం చేసారంటే నమ్మశఖ్యంగా లేదు. కానీ ఆయన ఫోన్‌ చేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వారి సంభాషణను రికార్డ్ చేసి మీడియాలో పెట్టేయడంతో అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“గట్టుప్పల్ నియోజకవర్గంలో మంచి పలుకుబడిన నేతగా మీకు మంచిపేరుందని మావాళ్లు చెపితేనే నేను మీకు ఫోన్‌ చేశాను. మీరు ఈ ఉపఎన్నికలలో మాకు సహకరిస్తే ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విదాలా అభివృద్ధి చేసుకొందాము. మేము ఏదో డొల్ల మాటలు చెప్పి మీ సాయం కోరడం లేదు. మీ నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 43 వేలమందికి పెన్షన్లు వస్తున్నాయి. మీ బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ పార్టీవాడు కాడు. ప్రధాని నరేంద్రమోడీ మీద ఆయనకు ఎటువంటి గౌరవం కూడా లేదు. ఆయన సంగతి మాకంటే మీకే బాగా తెలుసు. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన చేసిందేమీ లేదు. మేము ఈ ఉపఎన్నికలలో ఓడిపోయినానంత మాత్రాన్న మా ప్రభుత్వం పడిపోదు… అతను గెలిచినంత మాత్రాన్న తెలంగాణలో మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. కనుక దయచేసి ఈ ఉపఎన్నికలలో మా పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు మీరు కాస్త మాకు సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను,” అని కేటీఆర్‌ అన్నారు.

కేటీఆర్‌ వంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఉపఎన్నికలకు ముందు తమ ప్రత్యర్ధి పార్టీ నేతకు ఫోన్‌ చేసి సహాయం కోరడం, అదీ… వారి పార్టీ అభ్యర్ధిని ఓడించడానికే తమకు సాయం చేయమని అభ్యర్ధించడం చాలా విడ్డూరంగా ఉంది. దీనిపై అప్పుడు బిజెపి నేతలు కేటీఆర్‌కు, టిఆర్ఎస్‌కు చురకలు వేయడం మొదలుపెట్టారు. మరి దీనిపై కేటీఆర్‌ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.