Dial 1100 and Hope Corrupt Officialచంద్రబాబుపై ఎవరెన్ని విమర్శలు చేసినా… మంచి పరిపాలనాధ్యక్షుడిగా విశేషమైన ఖ్యాతి బాబు సొంతం. అందుకే విభజన తర్వాత ఏపీకి సరైన వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడే అన్న రీతిలో తీర్పును అందించారు. అయితే హైదరాబాద్ నుండి అమరావతికి ఉద్యోగులను తరలించే క్రమంలో మొదటి రెండు సంవత్సరాలు సమయం గడిచిపోయింది గానీ, ప్రజలు ఆశించిన చంద్రబాబు ‘మార్క్’ పాలన అయితే సాగలేదన్నది స్పష్టం. దీనికి రకరకాలు కారణాలు ఉండొచ్చు గానీ, అన్నింటా కాస్త వేచిచూసే ధోరణినే చంద్రబాబు అనుసరిస్తూ వస్తున్నారు.

అయితే మళ్ళీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమరావతి కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఇకపై తగిన రీతిలో విధులు నిర్వహించకపోతే, మొదటి మూడు సంవత్సరాలలో చూసిన చంద్రబాబును కాకుండా, పూర్వపు చంద్రబాబును చూస్తారని ఒక విధమైన హెచ్చరికలను జారీ చేసారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు లంచగొండిమయం అయిపోయారన్న భావన ప్రజలలో పెరిగిపోవడంతో, ముందుగా దీనిపై దృష్టి కేంద్రీకరించినట్లుగా స్పష్టమవుతోంది.

అందులో భాగంగానే ‘డయల్ 1100’ను ప్రారంభించారు చంద్రబాబు. ఏదైనా పని కోసం ప్రభుత్వ అధికారులకు లంచం ఇస్తే… ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలిపితే… లంచం తీసుకున్న వారే స్వయంగా మీ ఇంటికొచ్చి, సదరు లంచం సొమ్మును మొత్తం తిరిగిచ్చేసే విధంగా దీనిని సిద్ధం చేసారు. ‘పీపుల్ ఫస్ట్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కాల్ సెంటర్ కు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. తాజా సమాచారం మేరకు 12 మంది అధికారులు ఇలా లంచం తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేసినట్లుగా తెలిసింది.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో అవినీతిమయ రాష్ట్రాలలో కర్ణాటక తర్వాత ఏపీ రెండవ స్థానంలో నిలిచిందన్న టాక్ తో, ఎలాగైనా అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చంద్రబాబు దీనిని వ్యూహరచన గావించారు. మే 25 ప్రారంభించిన 1100 కాల్ సెంటర్‌ కు బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు. నిజానికి ఇలాంటి చర్యలనే చంద్రబాబు చేపడతారని ప్రజలు విశ్వసించి పాలనా పగ్గాలను చేతికి అందించారు. కాస్త ఆలస్యంగా అయినా ప్రజల ఏమోషన్ తో కనెక్ట్ అయ్యారు చంద్రబాబు.

అయితే ఇలాగే ప్రతి కేసులోనూ లంచాలు తిరిగి వచ్చేస్తాయన్న నమ్మకం అయితే లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రస్తుతం తిరిగి ఇచ్చిన మొత్తం చాలా తక్కువ సంఖ్యలోవి కాగా, బిగ్ షాట్స్ వివరాలు బయటకు వస్తాయా? వచ్చినా అవి తిరిగి వస్తాయా? అన్నది ఆసక్తికరమైన అంశం. అయితే బిగ్ షాట్స్ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎలా వ్యవహరించినా, సామాన్య ప్రజలకు కాస్త ఊరటనిచ్చే విధంగా పనులు చేస్తే చాలు… ఈ ‘పీపుల్స్ ఫస్ట్’ కార్యక్రమం చంద్రబాబు పాలనలో ‘తురుపుముక్క’గా ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం.