dhruva-release-date-confirmed-dec-9-ram-charanపెద్ద నోట్లు రద్దయిన నేపధ్యంలో… ఖచ్చితంగా వాయిదా పడుతుందనుకున్న మెగా వారసుడు రామ్ చరణ్ నటించిన “ధృవ” అనూహ్యంగా రేసులోకి వచ్చింది. డిసెంబర్ 9వ తేదీన విడుదల అని స్వయంగా చెర్రీ ప్రకటించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ‘విడుదల వాయిదా అనివార్యం’ అని భావించిన సమయంలో… ఒక్కసారిగా విడుదల తేదీని ప్రకటించడం వెనుక ఎవరు ఉన్నారు? అంటే ఓ చిన్న హీరో పేరు టాలీవుడ్ లో మారుమ్రోగుతోంది.

అతను మరెవరో కాదు… సినిమాలన్నీ వాయిదాలు పడుతున్న తరుణంలో… ధైర్యంగా తన సినిమాను విడుదల చేసిన హీరో నిఖిల్. “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాను విడుదల చేసి తెలుగు సినీ ప్రేక్షకుల అభిరుచి ఏమిటో మరోసారి చాటిచెప్పాడు నిఖిల్. ఎంత కష్టకాలంలో ఉన్నా, తమకు నచ్చే విధంగా సినిమాలను విడుదల చేస్తే… కష్టాలకతీతంగా వాటిని ఘనవిజయం చేసి చూపిస్తామని “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో సినీ ప్రేక్షకులు నిరూపించారు.

“ధృవ” సినిమాను విడుదల చేయడానికి “రామ్ చరణ్ అండ్ కో” కొండంత ధైర్యాన్ని ఇచ్చింది ఈ చిన్న సినిమా సాధించిన ఫలితాన్నే. ఈ సమయంలోనూ నిఖిల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను అందించిన తెలుగు ప్రేక్షకుల మనసుకు నిఖిల్ తన కన్నీళ్ళతో అభివాదాలు చేసారు. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు వరకు అన్నీ సందేహాలే. కానీ, విడుదలైన తర్వాత మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ నమ్మకంతోనే “ధృవ” కూడా విడుదలకు ముస్తాబయ్యాడు.

ఓ పెద్ద బ్యానర్, ఓ పెద్ద హీరో నుండి వస్తున్న సినిమా కావడంతో… నిఖిల్ వంటి చిన్న హీరో ఇచ్చిన ప్రోత్సాహాన్ని బయట పెడతారో లేదో గానీ, నూటికి నూరు శాతం “ధృవ” విడుదల కావడానికి కారణం మాత్రం నిఖిల్ చూపించిన తెగువేనని కృష్ణనగర్ కబుర్లకు కొదవలేదు. అయితే ఆ తెగువ ప్రదర్శించినందుకు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా అంతకు మించిన ఆదరణను చూపించి, నిఖిల్ ను ‘రియల్ హీరో’గా నిలబెట్టారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ విన్నా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అంటూ పలకరించుకోవడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది.