Dharmana Prasada Rao Visakhapatnam Capital“నా మాటే శాసనం…” అని బాహుబలిలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ అక్షరాల సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆయన మనసులో పుట్టిన ఆలోచనలే శాసనాలుగా ఏపీలో చలామణి అవుతున్నాయి. వాటిని ఎవరూ వ్యతిరేకించడానికి వీలు లేదు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ‘మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం’ అంటూ ఆయనకు వంత పాడుతున్నారు. కానీ వారిలో ఎంతమందికి నిజంగా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నారో ఇప్పుడు తెలీదు. కానీ వారిలో ఎవరైనా వైసీపీని విడిచిపెట్టినప్పుడు వారి నోటితో వారే తప్పక చెపుతారు… ఇదో వెర్రి ఆలోచన అని!

కానీ అంతవరకు తమ అధినేత మెప్పు కోసం అందరూ వంతపాడక తప్పదు కనుక మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా శ్రీకాకుళంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ‘విశాఖపట్నమే మన రాజధాని’ అంటూ నినదించారు. కానీ ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో ఆయన షాక్ అయ్యారు.

వారిపై ధర్మాన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, “ఏం విశాఖ మన రాజధాని కావడం మీకెవరికీ ఇష్టం లేదా?విశాఖ మన రాజధాని అని అనడానికి మీకెవరికీ నోరు పెగలదా?విశాఖ రాజధాని అంటే ఏదో నోట్లోనే గొణుకొంటున్నారు! సంక్షేమ పధకాల గురించి గట్టిగానే మాట్లాడుతారు కదా? అప్పుడూ ఇలాగే మౌనంగా ఊరుకోవచ్చు కదా?విశాఖ రాజధాని అయితే మీరు, మీ పిల్లలు అందరూ బాగుపడతారు. మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక నేను విశాఖపట్నం అని అనగానే మీరందరూ గట్టిగా మన రాజధాని అని నినాదం చేయాలి సరేనా?అని హెచ్చరించడంతో ఆయనను కాదనలేక స్థానికులు నినదించారు

ధర్మాన సొంత నియోజకవర్గంలో ప్రజలకే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన ఇష్టం లేదని, ఆయన వారి చేత బలవంతంగా ‘జై’ కొట్టించాల్సి వచ్చిందని అర్దమవుతోంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వారి అభీష్టం ఏవిదంగా ఉందో తెలుసుకోకుండా తన మనసులో పుట్టిన ఆలోచనలనే ప్రజాభిప్రాయాలుగా బలవంతంగా వారిపై రుద్దాలని చూస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.

సుదీర్గ రాజకీయానుభవం కలిగిన మంత్రి ధర్మానకు ఈ విషయం తెలియదనుకోలేము. కానీ పిల్లి మెడలో గంటెవరు కడతారు?అన్నట్లు పార్టీలో సీనియర్లందరూ తమ అభిప్రాయాలను పక్కన పెట్టి తమ అధినేతకు వంతపాడుతున్నారని భావించవచ్చు. కానీ ఈ మూడు రాజధానుల ప్రతిపాదనే వచ్చే ఎన్నికలలో తమ కొంప ముంచుతుందేమో?అని అందరూ లోలోన భయపడుతూనే ఉండవచ్చు. ఇటు తమ అధినేతకు చెప్పలేక, ప్రజలకు నచ్చజెప్పలేక ఇబ్బంది పడుతున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే జాలేస్తుంది.