Minister Dharmana Prasada Rao Press meet in Vizagవైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా వద్దనుకొంది. అదే ప్రజాభిప్రాయం కూడా అని వితండవాదం చేస్తూ మూడు రాజధానుల పేరుతో మూడున్నరేళ్ళుగా కాలక్షేపం చేసేసింది. అయితే మూడు రాజధానుల వెనుక మర్మమేమిటో మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా బయటపెట్టేశారు.

సోమవారం శ్రీకాకుళం పట్టణంలో ‘మన విశాఖ-మన రాజధాని’ పేరుతో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “మనం ప్రతీసారి మూడు రాజధానులు… మూడు రాజధానులు అని అనక్కరలేదు. విశాఖ రాజధాని అని అనుకొంటే చాలు. కర్నూలులో న్యాయ సంబంధమైన, అమరావతిలో శాసనసంబంధమైన వ్యవహారాలు మాత్రమే జరుగుతాయి. కనుక రాష్ట్రానికి ప్రధానమైనది విశాఖలో రాజధాని మాత్రమే. కనుక విశాఖ రాజధాని కోసమే మన పోరాటం అంతా.

దానిని నేను ఎంత సీరియస్‌గా తీసుకొన్నానో అందరికీ తెలియజేసేందుకే నేను రాజీనామా చేసేందుకు సిద్దమయ్యాను. కానీ విశాఖ రాజధాని కాకుండా అడ్డుకొనేందుకు అచ్చెన్నాయుడు వంటి స్థానిక టిడిపి నేతలని చంద్రబాబు నాయుడు పురిగొల్పి అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లా టిడిపి నేతలకు విశాఖ రాజధాని వద్దనుకొంటే ఇంట్లో కూర్చోంటే నేను పోరాడుతాను. కానీ నా పోరాటానికి అడ్డుపడుతూ ఉత్తరాంద్ర జిల్లాలకు అన్యాయం చేయవద్దని మనవి చేస్తున్నాను. నన్ను రాజకీయంగా ఎదుర్కొలేకనే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను విశాఖలో అక్రమంగా భూములు సొంతం చేసుకొన్నట్లు నిరూపిస్తే వాటన్నిటినీ వారికే రాసిస్తాను,” అని అన్నారు.

అమరావతి రాజధానిగా తమకు అంగీకరించబోమని వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ తెగేసి చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. అదుకే మూడు రాజధానులలో ఒకటైన అమరావతి గురించి ఆయా జిల్లాల వైసీపీ నేతలు ఎవరూ ఎన్నడూ గట్టిగా మాట్లాడటం లేదు. అంటే అది లెక్కలో లేనట్లే కదా?

ఇక మిగిలింది కర్నూలులో న్యాయరాజధాని. అది రాయలసీమ ప్రజలను మభ్యపెట్టేందుకే ఆడుతున్న ఓ డ్రామా అని, వైసీపీ దృష్టిలో అసలు సిసలు రాజధాని మాత్రం విశాఖపట్నం మాత్రమే అని మంత్రి ధర్మాన మాటలలోనే స్పష్టం అయ్యింది. మూడు రాజధానులని అనక్కరలేదు విశాఖ రాజధాని అనుకొంటే చాలని ధర్మాన చెప్పడం వెనుక అర్దం ఇదే కదా?

కనుక ఈ మూడు రాజధానుల పేరుతో రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో వైసీపీ నేతలు ఈవిదంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ, రాజధాని కోసం పోరాటాల పేరుతో ప్రజలపై, జిల్లా రాజకీయాలపై తమ పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కూడా ధర్మాన మాటలతోనే అర్దం అవుతోంది. టిడిపి నేతలు ఇంట్లో కూర్చోబెట్టి మేము పోరాటాలు చేస్తూ పట్టు సాధించుకొంటామని చెపుతున్నారు.

విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్దం అని మంత్రి ధర్మాన అంటున్నారే గానీ రాజీనామా చేయడం లేదు. అంటే అదీ ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న మరో డ్రామా అని స్పష్టం అవుతోంది. అంటే ఈ మూడు రాజధానుల డ్రామా వెనుక వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ ఆసక్తులు, వారి రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి తప్ప వికేంద్రీకరణ, అభివృద్ధి కావని స్పష్టం అవుతోంది.