Dharmana-Prasada-Rao-Seperate Uttarndhra-State.jpgఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాలు జాలిపడుతుంటే, మన మంత్రుల మాటలు విని అందరూ నవ్వుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు అయినా రాజధాని లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకొంటే, ఏపీలో దశాబ్ధాలుగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో తెలీదని ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు నిసిగ్గుగా చెపుతుంటారు. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేకపోతున్నప్పటికీ సిఎం జగన్‌ దాని పేరు చెప్పుకొని నెలనెలా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం మరిచిపోరు! ఇక సంక్షేమ పధకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు మరో ముప్పై ఏళ్ళు తీర్చినా తీరేవి కావు కనుకనే మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉండాలని వైసీపీ భావిస్తున్నట్లుంది.

ఇవన్నీ సరిపోనట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తనను తాను విశాఖ రాజధాని ఉద్యమకారుడిగా అభివర్ణించుకొంటూ మాట్లాడుతున్న మాటలు ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రగుల్చుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనేందుకే అమరావతిని రాజధానిగా చేయాలని పట్టుబడుతున్నారు. వారి వ్యాపారాల కోసం అమరావతిని రాజధాని చేస్తే ఎంతమాత్రం సహించబోము. ఒకవేళ అమరావతి రాజధానిగా చేస్తే ఉత్తరాంద్ర జిల్లాలు ఎప్పటికీ వెనకబడిపోతాయి. కనుక విశాఖని మాకిచ్చేయండి. మేము విశాఖ రాజధానిగా విశాఖ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసుకొంటాము,” అని మంత్రి ధర్మాన అన్నారు.

ఇప్పటికే రాష్ట్రవిభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణంగా దెబ్బతిని నేటికీ కోలుకోకపోగా నానాటికీ దిగజారిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానుల పేరుతో నిర్వహిస్తున్న గర్జన సభలను చూస్తే ఆ పేరుతో రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు రగిలించి వచ్చే ఎన్నికలలో టిడిపిని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.

ఏవిదంగా అంటే, ఐదేళ్ళపాటు రాష్ట్రంలో వైసీపీయే అధికారంలో ఉండబోతున్నప్పటికీ ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు చేయకుండా ఆ పేరుతో టిడిపి, జనసేనలను తిట్టిపోస్తోంది. వైసీపీ తన రాజకీయ లబ్ది కోసం ఏపీని, దాని భవిష్యత్‌ని పణంగా పెట్టి ఈ రాజకీయ చదరంగం ఆడుతోంది.

ఇదే పెద్ద తప్పనుకొంటే, మంత్రి హోదాలో ఉన్న ధర్మాన ఇప్పుడు రాష్ట్రాన్ని మరోసారి ముక్కలు చేయాలని డిమాండ్ చేస్తుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే తపన, పట్టుదల, దూరదృష్టి వైసీపీ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఈ మూడున్నరేళ్ళలో చాలానే అభివృద్ధి చేసి ఉండవచ్చు. కానీ వారి అధినేత బటన్ నొక్కుతూ కాలక్షేపం చేస్తుంటే ధర్మాన, బొత్స వంటి మంత్రులు కనీసం తమ జిల్లాలని కూడా అభివృద్ధి చేసుకోకుండా ఈవిదంగా రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు.