Dharmana-Prasada-Rao-Botsa-Satyanarayanaప్రజలు రాజకీయపార్టీలని ఎందుకు ఎన్నుకొంటారు?తాము నేరుగా పాలించలేరు కనుక! రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలించమని, అభివృద్ధి చేయమని వాటికి బాధ్యత అప్పగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లుగా జరుగుతున్నదేమిటి?మూడు రాజధానులపేరుతో రాజకీయాలు మాత్రమే.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం అటకెక్కించేసింది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందంటే ‘పవన్‌ కళ్యాణ్‌ నాలుగో పెళ్ళి చేసుకొనేలోపుగా…’ అని ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబు గొప్పగా సెటైర్ వేస్తారు. ఆయనకు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి తెలుసో తెలీదో కానీ టిడిపి, జనసేన, రాజధాని రైతుల మీద ఇటువంటి సెటైర్లు వేయడం మాత్రం బాగావచ్చు. ఇక రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ వాటి గురించి ఎప్పుడూ మాట్లాడరు కానీ విశాఖ రాజధాని గురించి, వికేంద్రీకరణ గురించి, రాజధానై రైతుల పాదయాత్ర గురించి మాట్లాడుతుంటారు.

ఇక విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన శాఖ గురించి మాట్లాడరు. నిజానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పదో తరగతి పరీక్షలు, ప్రశ్నాపత్రాల లీకులు, ఫలితాలు, పాఠశాలల విలీనం, మొబైల్ యాప్‌లో ఉపాధ్యాయుల హాజరు వంటి అనేక సమస్యలు వచ్చాయి. ఈలోగా రైతుల పాదయాత్ర పుణ్యామాని ఇప్పుడు ఆ సమస్యలన్నీ పక్కకుపోయాయి. ఇప్పుడు తనకు మంచి పట్టున్న రాజకీయాల గురించి బొత్సవారు అనర్గళంగా ఎంతసేపైనా మాట్లాడగలుగుతున్నారు. విశాఖ రాజధాని అయితేనే ఉత్తరాంద్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, దానిని అడ్డుకోవడానికే రాజధాని రైతులు దండయాత్రగా వస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.

ఇక రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఏనాడూ తన శాఖకు సంబందించిన అంశాలను మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ విశాఖలో అసైన్డ్ భూముల వ్యవహారంలో స్వయంగా ఆయన హస్తం ఉందని సిట్ నివేదికలో పేర్కొంది. పర్యాటకశాఖ మంత్రి రోజా వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ బీచ్‌ రోడ్డులో జరిగిన విశాఖ గర్జన సభకు వచ్చారు. ఏపీలో ప్రధాన పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖ రామకృష్ణ బీచ్‌ ఒకటి. కానీ వేదిక పక్కనే ఆర్‌కె బీచ్‌లో పోగులు పడిఉన్న చెత్తా చెదారం, సముద్రంలో కలుస్తున్న మురికి కాలువలను, కోతకు గురవుతున్న సముద్రం ఒడ్డుని తొంగి చూడకుండానే తిరిగి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలనే తన కార్యకర్తలు నెరవేర్చుకొంటే, జీవితంలో ఎప్పటికైనా మంత్రి కావాలని రోజా ఎంతగా తహతహలాడిపోయారో అందరికీ తెలుసు. కానీ మన మంత్రుల తీరు ఇలా ఉంది.

తమ శాఖల బాధ్యతలు నిర్వర్తించడానికి వారికి తీరిక ఉండదు కానీ మూడు రాజధానుల పేరుతో జరుగుతున్న రాజకీయాలలో మాత్రం చాలా చురుకుగా పాల్గొంటారు. రాజధాని పేరుతో టిడిపి, జనసేనలు ప్రజల మద్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపిస్తుంటారు. కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసిన వారే.. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు రౌండ్ టేబిల్ సమావేశాలు, విశాఖ గర్జన సభలు నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొడుతుండటం నిజం కాదా?

తాజాగా మంత్రుల పాదయాత్రలు, రాజీనామాల డ్రామా మొదలుపెట్టబోతున్నట్లు మీడియాకు లీకులు ఇస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డిని అభ్యర్ధించినట్లు ఆ లీక్ సారాంశం. ధర్మానకు నిజంగా రాజీనామా చేయాలనుకొంటే రాజీనామా పత్రాన్ని సంతకం చేసి ముఖ్యమంత్రి చేతిలో పెట్టవచ్చు కదా?ఇంతకు ముందు చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా రాజీనామా చేస్తున్నానంటూ జేఏసీ కన్వీనర్ చేతిలో ఓ లేఖ పెట్టి డ్రామా చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. నేటికీ ఆయన రాజీనామా చేయనేలేదు.

ఇప్పుడు మళ్ళీ మొదట చెప్పుకొన్న విషయానికి వస్తే, ప్రజలు టిడిపిని కాదని వైసీపీని ఎందుకు ఎన్నుకొన్నారు? కానీ వారు చేస్తున్నదేమిటి? ప్రభుత్వం నడిపించమని చెపితే పాదయాత్రలు, గర్జన సభలు, రాజీనామాలు చేస్తున్నారు. ఒకవేళ వారికి తమ మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకొంటే ఇవన్నీ చేసే బదులు ప్రభుత్వం రద్దు చేసి మూడు రాజధానులు అంశంతోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ప్రజలే తాడో పేడో తేల్చేస్తారు కదా?