Dharmana-Prasada-Raoమంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం శ్రీకాకుళం పట్టణంలో గడప గడపకి కార్యక్రమంలో మూడు రాజధానులు-అధికార వికేంద్రీకరణ రహస్యం గురించి మళ్ళీ మరోసారి అందరికీ అర్దమయ్యేలా వివరించారు. “మూడు రాజధానులు… మూడు రాజధానులు అంటూ కొందరు వెటకారంగా మాట్లాడుతున్నారు. కానీ నిజానికి ఒకే ఒక్క రాజధాని ఉంటుంది. అది విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. అయితే కర్నూలులో హైకోర్టు, అమరావతిలో సచివాలయం ఉంటుందని మేము చెప్పడంతో దానిని ప్రతిపక్షాలు తప్పుగా అర్దం చేసుకొని ప్రజలను రెచ్చగొడుతున్నాయి. కానీ పరిపాలన అంతా విశాఖ నుంచే సాగుతుంది. కోర్టు వ్యవహారాల కోసం రోజూ ఎవరూ కర్నూలు వెళ్ళరు కదా? అలాగే శాసనసభ సమావేశాలకు ఏడాదికో మూడు నాలుగుసార్లు ప్రజాప్రతినిధులు మాత్రమే వెళ్ళివస్తుంటారు.

రాష్ట్రానికి మద్యలోనే రాజధాని ఉండాలని కొందరు వితండవాదం చేస్తున్నారు. అయితే రాష్ట్రాన్ని టేపుతో కొలిచి సరిగ్గా మద్యలోనే రాజధాని నిర్మించాలా?దేశంలో ఆరేడు రాష్ట్రాలలో రాజధాని ఒక చోట, హైకోర్టు, మరోచోట శాసనసభ ఉన్నాయి. వాటికి లేని ఇబ్బంది మనకెందుకు వస్తుంది?

విశాఖకు రైల్, రోడ్, సీ, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. కనుక విశాఖ రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. రాజధానికి ఓ 500 ఎకరాలు చాలు. అది విశాఖలో ఉంది. కనుక విశాఖలో రాజధాని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం. కనుక జగనన్న నిర్ణయానికి మనం అందరం మద్దతు తెలపడం అవసరం.

ఇక రాజధాని వస్తే ప్రభుత్వమే అంతా అభివృద్ధి చేసేస్తుందని కాదు. రాజధాని వస్తే ప్రైవేట్ పరిశ్రమలు, వాటికి అనుబంద పరిశ్రమలు అనేకం తరలివస్తాయి. వాటితో స్థానిక యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఆవిదంగా అభివృద్ధి జరుగుతుందన్న మాట!

ఇక మా ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలను పూడ్చలేకపోయిందని టిడిపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అవన్నీ మీ హయాంలో ఏర్పడిన గోతులే. అవే పెరిగి పెద్దవైపోయాయి తప్ప మేమేమి గునపాలు తీసుకొని రోడ్లను తవ్వేయలేదు కదా? అసలు ఓ రోడ్డు వేస్తే కనీసం 5 ఏళ్ళు చెక్కుచెడకుండా ఉండాలి. కానీ మీ హయంలో వేసిన రోడ్లు మేము అధికారంలోకి వచ్చేసరికే గుంతలు పడిపోయాయి. మరి మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏం పీకినట్లు? అది మీ వైఫల్యమే కదా? అయినా శ్రీకాకుళంలో ఒక్క గుంతలు పడిన రోడ్డును చూపించమనండి చూద్దాం!

సంస్కరణల కారణంగా మా ప్రభుత్వంపై ప్రజలలో కొంత వ్యతిరేకత, అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవం. కానీ సంస్కరణలను ప్రారంభిస్తే వాటి ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. కనుక వెంటనే ఫలితాలు ఆశించకూడదు. ముందుగా సంస్కరణలను అర్దం చేసుకోవాలి,” అని మంత్రి ధర్మాన చెప్పారు.