వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై మూడు స్తంభాలాటలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తోంది. కానీ ఇప్పుడు రైతులు అరసవిల్లికి మహా పాదయాత్ర ప్రారంభించడంతో రాజధాని నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఆ పార్టీ నేతలు బయటపెట్టక తప్పడం లేదు.
ఏపీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ, “అమరావతిలో 29 గ్రామాల రైతులు చంద్రబాబు నాయుడు మాయలో పడి ఈ మహాపాదయాత్ర చేస్తున్నారు. కనుక వారు అరసవిల్లి వచ్చి స్వామివారిని దర్శించుకొని తిరిగివెళ్ళిపోవాలి అంతే తప్ప ఇక్కడకి వచ్చి రాజకీయాలు చేస్తామంటే కుదరదు. సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలనే మంచి ఆలోచనతోనే మూడు రాజధానుల ప్రతిపాదన చేసి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా నిర్ణయించారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే దానికి సమీపంలో ఉన్నందున శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుంది. అమరావతిని రాజధానిగా చేసి శ్రీకాకుళం ఎప్పటికీ వెనకబడిన జిల్లాగానే మిగిలిపోవాలని వారు కోరుకొంటున్నారా?మా జిల్లాకు మీరు నష్టం కలిగిస్తుంటే మేము నోరు మూసుకొని కూర్చోవాలా?విశాఖలో రాజధానిని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు వద్దనడం చాలా తప్పు. మేము మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజామోదంతోనే మేము అమలుచేస్తాం,” అని అన్నారు.
నిజానికి ధర్మాన ప్రసాదరావునే శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఓ ప్రశ్న అడగాలి. ఆయన కొత్తగా రాజకీయాలలోకి రాలేదు. గతంలో కూడా మంత్రిగా చేశారు. మళ్ళీ ఇప్పుడూ జగన్ ప్రభుత్వంలో కీలకమైన రెవెన్యూశాఖకి మంత్రిగా చేస్తున్నారు. ఇన్ని దశాబ్ధాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్నా, తన జిల్లాని ఎందుకు అభివృద్ధి చేయలేదు?మంత్రిగా ఉన్న ఆయన నేటికీ తన జిల్లా వెనుకబడి ఉందని చెప్పుకొంటున్నారంటే అర్దం ఏమిటి? ఇప్పుడు జిల్లా నుంచి సీదిరి అప్పలరాజు కూడా మంత్రిగా ఉన్నారు. జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడంలేదు? అని జిల్లా ప్రజలే ఆ ఇద్దరు మంత్రులను ప్రశ్నించాలి.
దివంగత టిడిపి ఎంపీ కింజారపు ఎర్రంన్నాయుడు పూనుకొని రణస్థలం వద్ద అనేక పరిశ్రమలు వచ్చేలా చేశారు. వాటిలో వేలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. వాటి నుంచి పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తోంది. ఒక ఎంపీ పూనుకొంటే జిల్లాలో ఇంత అభివృద్ధి సాధ్యమైనప్పుడు మంత్రులు పూనుకొంటే ఇంకెంత అభివృద్ధి జరిగి ఉండేదో ఊహించుకోవచ్చు. కానీ విజయనగరానికి చెందిన బొత్స సత్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకి చెందిన ధర్మాన ప్రసాదరావు చాలాసార్లు మంత్రులుగా పనిచేసిన్నప్పటికీ వారి జిల్లాలలో కొత్తగా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోయారు. కనీసం జిల్లాలో రోడ్లు, వంతెనలు కూడా వేయించలేకపోయారు.
జిల్లాకి ఒకరిద్దరు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలను అభివృద్ధిచేయలేకపోతునప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధానికి సమీపంలో జిల్లాలు ఉంటే వాటంతటే అవే అభివృద్ధి చెందిపోతాయా? మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ జిల్లాలను, నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలనే తపన, చిత్తశుద్ధి లేదు కనుకనే నేడు శ్రీకాకుళం జిల్లాతో సహా రాష్ట్రంలో పలు జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. తప్పు తమలో పెట్టుకొని రాజధాని కోసం పోరాడుతున్న రైతులను నిందించడం దేనికి?