Sir/ Vaathi Movie Reviewఇప్పటి జెనరేషన్ కు సున్నితమైన ఎమోషన్స్ సినిమాల ద్వారా చెబితే తలకెక్కుతాయా అంటే సమాధానం చెప్పడం కష్టం. అలా అని అవి పూర్తిగా వాళ్లలో అడుగంటిపోయాయా అంటే అదీ లేదు. ఒకవేళ నిజమైతే జెర్సీ లాంటివి డిజాస్టర్ కావాలి. కానీ రిసీవ్ చేసుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి హాఫ్ బేక్డ్ ఫారిన్ ప్రేమకథలుతో బోర్ కొట్టించేశానని తనే ఒప్పుకున్నాడు కదా. అందుకే ఈసారి మళ్ళీ ఆ ఫిర్యాదు రాకుండా తెలుగు తమిళ ఆడియన్స్ కి సూటయ్యే పక్కా లోకల్ విలేజ్ స్టోరీని రాసుకున్నాడు. అదే సార్. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు తీస్తున్న స్టార్ బ్యానర్ నుంచి వస్తున్న మూవీ అంటే ఓ మోస్తరు కాదు మంచి అంచనాలే ఉంటాయి.

ఒక స్కూల్ లేదా కాలేజీ మాస్టారుని హీరోగా పెట్టి చాలా సినిమాలొచ్చాయి. ఎన్టీఆర్ విశ్వరూపం, చిరంజీవి మాస్టర్, వెంకటేష్ సుందరకాండ, నాని మజ్ను ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. అవన్నీ కమర్షియల్ కొలతల్లో క్లాసు మాస్ ఇద్దరినీ ఆకట్టుకునేలా తీసినవి. అందుకే అధిక శాతం విజయం సాధించాయి. కొన్నిట్లో ఎంటర్ టైన్మెంట్ డామినేట్ చేస్తే మరికొన్నిట్లో యాక్షన్ పెద్ద పీఠ వేసుకుంది. కానీ వెంకీ డిఫరెంట్ గా ఆలోచించే ప్రయత్నం చేశాడు. ఈ రెండు లేకుండా సందేశాన్ని, ఆలోచన రేకెత్తించే నేపధ్యాన్ని తీసుకుని ఒకరకంగా ప్రయోగమే చేశాడు. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి ఏదో నేర్పించాలని తాపత్రయపడ్డాడు. అదే సార్.

ఒక చిన్న ఊరికి కాంట్రాక్టు మీద జూనియర్ లెక్చరర్ బాలు(ధనుష్)కి అక్కడ పిల్లలకు అసలు చదువే లేదని పేదరికం వల్ల అందరూ పనుల్లోకి వెళ్తున్నారని గుర్తించి వాళ్ళను ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకుంటాడు. బాలుని పంపించిన కార్పొరేట్ పిశాచి త్రిపాఠి (సముతిరఖని)కి ఇదంతా నచ్చక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాడు. అవమానాలు ఛీత్కారాల మధ్య బాలు ఏకంగా వెలేసే దాకా తెచ్చుకుంటాడు. అయినా పట్టు వదలడు. చివరికి గమ్యం చేరుకుంటాడు. సార్ లో ఫీడ్ గుడ్ ఎమోషన్స్ ఉన్నాయి. అందులో అనుమానం లేదు. బలంగా కనెక్ట్ అయ్యే ఎపిసోడ్స్ పెట్టారు. మాస్ కోసమని ఫైట్లు చేయించారు. హీరోయిన్ తో డ్యూయెట్లు పాడించారు

అన్నీ ఉన్నా కూడా సార్ లో ఏదైతే హైలైట్ గా నిలిచిందో అదే బరువుగా మారిపోయి సందేశాల ప్రహసనంగా మిగిలింది. అలా అని నిరాశపరుస్తుందని కాదు. సగటు పబ్లిక్ కోరుకునే వినోదం లేకుండా ఎప్పుడో 1998 నాటి సమస్యని మరీ ఇంత సీరియస్ గా చెప్పే ప్రయత్నమే కొన్ని వర్గాలకు మాత్రమే చేరువయ్యే ముప్పుని కొనితెచ్చింది. ధనుష్ నటన, జివి ప్రకాష్ సంగీతం బలంగా నిలబడకపోతే నిజంగానే క్లాసు కొంచెం తేడా కొట్టేది. ఈ ఇద్దరూ బాహుబలి ప్రభాస్ లాగా వెంకీ ఊగిసలాడించిన గ్రాఫ్ ని నిలబెడుతూ వచ్చారు. మాకేం వద్దు రెండు గంటల భావోద్వేగాలు కాసింత గుండెను తడిమేలా ఉంటే చాలనుకుంటే సార్ ని నిక్షేపంగా పలకరించి రావొచ్చు.