Dhanush Sir Audio Launchపక్క భాషలో మన సినిమా పెద్ద ఎత్తున డబ్బింగ్ చేసుకుని విడుదలవుతున్నప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సరే తనవంతుగా ముందుకొచ్చి ప్రమోషన్లలో పాల్గొనడం కనీస బాధ్యత. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తనతో వారసుడు తీసినప్పుడు విజయ్ కనీసం ఒక ఈవెంట్ లో ఇంటర్వ్యూకో రాకుండా నేనింతే అని ప్రకటించుకోవడం ఏ కోణంలోనూ సమర్ధించలేనిదే. అసలు అలాంటివి ఇష్టం లేడనప్పుడు చెన్నైలో లక్షల మంది ఫ్యాన్స్ ముందు ఓపెన్ స్టేడియంలో డాన్స్ చేయడం అందరూ లైవ్ లో చూశారుగా దానికేమంటారు. విజయ్ కు హైదరాబాద్ లో పార్టీకి వచ్చే తీరిక ఒక ప్రెస్ మీట్ కు లేకపోయింది.

సరే ఇది పక్కనపెడితే ధనుష్ ఇవాళ సార్ ట్రైలర్ లాంచ్ కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇదొక్కటే కాదు మీడియాతో ఇంటరాక్షన్లు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు నిర్మాతలు అడిగితే ఎస్ అన్నాడు. ఇందులో మరీ అంత విశేషం ఏముంది అనుకోకండి. గతంలో విక్రమ్, సూర్య, కార్తీ లాంటి వాళ్ళు కూడా వచ్చారు. అయితే ధనుష్ తన ప్రత్యేకత ఈ విషయంలో కాదు నిలబెట్టుకున్నది. బై లింగ్వల్ గా ఈ సినిమాను తెరకెక్కించినప్పుడు రెండు భాషల్లో ఒకే సీన్ ని రెండుసార్లు అభినయించేందుకు సిద్దపడటం. దాని కోసం ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని మరీ రిస్క్ చేశాడు.

గతంలో ఒక్క మమ్ముట్టి మాత్రమే ఇలా రాజీ పడని ధోరణి చూపించేవారు. స్వాతికిరణం చేసే టైంలో ఆయనకు ముక్క తెలుగు రాదు. అయినా సరే కె విశ్వనాధ్ గారి చిత్రం కాబట్టి పట్టుబట్టి మరీ క్లిష్టమైన పదాలను అలవోకగా పలికారు. దళపతిలో ఒరిజినాలిటీ మిస్ కాకూడదని మణిరత్నం అడగకపోయినా తన స్వంత గొంతుని వినిపించేందుకు సిద్ధపడ్డారు. అదే అద్భుతంగా తెరమీద పండింది. ఇలాంటి వాళ్ళు అరుదు. కార్తీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. తమ్ముణ్ణి చూసే అన్నయ్య సూర్య ఓసారి స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు కానీ అంతగా వర్కౌట్ కాకపోవడంతో మానుకున్నాడు.

ఇలాంటి మనస్తత్వమే స్టార్లకు ఉండాల్సింది. ఇదేదో అరవ హీరోలను పొగడటం కాదు. మనకు తమిళంలో పెద్దగా మార్కెట్ లేదు కాబట్టి చెన్నై దాకా వెళ్లి ప్రమోషన్లు చేసే అవసరం పడలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి వాటికి కోలీవుడ్ మీడియాను మన హీరోలు ప్రత్యక్షంగా పలకరించారు. కానీ తమిళ హీరోలకు ఇక్కడ ముందు నుంచి ఆదరణ ఉంది. కమల్ హాసన్ నుంచి విజయ్ సేతుపతి దాకా అందరినీ వాళ్ళ టాలెంట్ ని బట్టి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చాం. అలాంటప్పుడు ఆ విలువ గుర్తెరిగి మసలుకుంటే మార్కెట్ తో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. ఎంతగా అంటే సార్ అని పిలిచేదాకా.