Devisri prasad's Boss party is over now its Thaman's turnసంక్రాంతికి హోరాహోరీగా తలపడుతున్న చిరంజీవి బాలకృష్ణల యుద్ధం ప్రమోషన్ల దగ్గరి నుంచే మొదలైపోతోంది. సినిమాల రిలీజుకు ఇంకో యాభై రోజుల టైం ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా పోలికల ప్రహసనం మొదలైపోతోంది. అసలే రెండు ఒకే నిర్మాణ సంస్థ నుంచి వస్తున్నాయి. ఒకరిది ఎక్కువ ఒకరిది తక్కువ అనిపించిందా ఫ్యాన్స్ తో నానా మాటలు అనిపించుకోవాలి. పైగా ఇద్దరివీ ఊర మాస్ కమర్షియల్ బొమ్మలు. సహజంగానే పోస్టర్లతో మొదలుపెట్టి పాటల దాకా ప్రతిదాంట్లోనూ శల్యపరీక్ష మొదలవుతుంది. టీజర్లు ట్రైలర్ ఏవీ మినహాయింపు కాదు. మొదటి అడుగు వాల్తేర్ వీరయ్య నుంచే మొదలయ్యింది.

బాస్ పార్టీ లిరికల్ వీడియో తాజాగా బయటికి వచ్చింది. తన మీద జరుగుతున్న ట్రోలింగ్, అనుమానాలను నిజం చేస్తూ దేవిశ్రీ ప్రసాద్ నిజంగానే ఆశించిన స్థాయిలో మేజిక్ చేయలేకపోయాడు. ఏదో కొత్త ప్రయోగం తరహాలో తన స్వంత గొంతు ర్యాంప్ పాడి మధ్యలో ఇతర సింగర్స్ లో లిరిక్స్ పాడించిన తీరు పాత దేవిని బయటికి తీసుకురాలేదు. రెగ్యులర్ ట్యూన్ తరహాలోనే సాగింది. కాకపోతే ఖరీదైన ఆర్ట్ వర్క్, చిరంజీవి మార్క్ హుషారైన స్టెప్పులు చూసేలా చేశాయి కానీ విడిగా కేవలం ఆడియో వింటే మాత్రం ఎన్నిసార్లో విన్న ట్యూనే అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే శంకర్ దాదా ఎంబిబిఎస్ జిందాబాద్ ల ఐటెం సాంగ్స్ స్టాండర్డ్ లో సగం కూడా లేదు

సుకుమార్ కు తప్ప ఇంకెవరికీ తన స్థాయి మ్యూజిక్ ఇవ్వడం లేదని ఫిర్యాదులు అందుకుంటున్న దేవి ఆఖరికి చిరంజీవికి సైతం ఇలా హ్యాండ్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు తమన్ వంతు రాబోతోంది. ఫామ్ లో డిఎస్పి కంటే మెరుగ్గా ఉన్న తను వీరసింహారెడ్డికి ఎలాంటి పాటలు ఇచ్చాడోననే ఆసక్తి బాలయ్య అభిమానుల్లోనే కాదు మెగా ఫాన్స్ లోనూ ఉంది. అఖండ లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేసిన తమన్ ఇప్పుడు అంతకు మించి ఇవ్వాల్సిందే. అంచనాల బరువు ఆ స్థాయిలో ఉంది. రాజసం నీ ఇంటి పేరు అంటూ సాగే పాటలో జై బాలయ్య టైటిల్ ట్రాక్ ని 25న రిలీజ్ చేయబోతున్నారు

గ్యాప్ రెండే రోజులు కాబట్టి ఎవరిది మెరుగ్గా ఉంటుందనే చర్చలు జరగడం సహజం. కాకతాళీయంగా వీరయ్యలో బాస్ పదాన్ని హైలైట్ చేస్తే ఇప్పుడీ వీరసింహాలో బాలయ్య నినాదాన్ని ఎక్కువగా వాడారు. ఇంకా రావాల్సిన పాటలు ఉన్నాయి కాబట్టి అప్పుడే ఎవరు బెస్ట్ అనే కంక్లూజన్ కు రాలేం. వీటి సంగతేమో కానీ మైత్రి మూవీ మేకర్స్ కి మాత్రం పబ్లిసిటీని బ్యాలన్స్ చేసుకోవడం పెద్ద సవాలే. టైంతో పాటు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇంకా రెండు షూటింగులు పూర్తి కాలేదు. చివరి దశలో ఉన్నాయి. డిసెంబర్ మూడో వారానికల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. మరి తమన్ అఖండను మరిపించేలా మేజిక్ చేస్తాడా ఇంకో రెండు రోజుల్లో తేలిపోతుంది.