PV_Sindhu-Hyderabad Airportహైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొంటున్న పలు వివాదాలపై ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఘాటు కామెంట్లు ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ ల నోట వెల్లువలా వినిపిస్తున్నాయి. అయితే రియోలో భారత సత్తా చాటిన పీవీ సింధు ఇరు రాష్ట్రాల మంత్రులను ఒక దగ్గర చేర్చడంలో సఫలీకృతమయ్యింది.

శంషాబాదు ఎయిర్ పోర్టుకు చేరుకున్న సింధుకు స్వాగతం పలికేందుకు రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు తరలివెళ్లాయి. ఏపీ తరఫున డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, బెజవాడ ఎంపీ కేశినేని నానిలతో కలిసి దేవినేని ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అదే సమయంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, పద్మారావులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సింధు కోసం వేచి చూసే క్రమంలో వారంతా ఎయిర్ పోర్టు లాంజ్ ల్లో కూర్చుకున్నారు. అది కూడా పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం విశేషం.

ఇక, శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సింధుకు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ అభిమాన సందోహం కరచాల ధ్వనుల మధ్య ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన సింధు… విజయోత్సవ ర్యాలీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సు టాపు పైకి ఎక్కింది. సింధు తో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా బస్సెక్కగా, సింధు పక్కన క్రీడారంగానికి చెందిన ప్రముఖుడు చాముండేశ్వరినాథ్ నిలబడగా, గోపీచంద్ పక్కన తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి నిలబడ్డారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభమైన ఈ విజయోత్సవ ర్యాలీ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం దాకా కొనసాగనుంది.