Devineni Umamaheswara Rao comments on KCRపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు గ్రామాల బదలాయింపుపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ముంపు మండలాల్లోని ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు బదలాయించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తమకు హామీ ఇచ్చారని గతంలో ఓ సారి చెప్పిన కేసీఆర్… శ్రీరామనవమి సందర్భంగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ విషయంపై చర్చ చేపట్టిన ఓ మీడియా ఛానల్ తో వ్యాఖ్యానించిన దేవినేని స్పష్టత ఇచ్చారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని మండలాలు ఏపీలో కలిశాయని, ఈ ముంపు మండలాలు ఏపీ పరిధిలో ఉంటేనే ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు పునరావాస కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని దేవినేని చెప్పారు. ఐదు గ్రామాలను తెలంగాణకు బదలాయించేందుకు చంద్రబాబు హామీ ఇచ్చారని కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపణలు చేసిన దేవినేని, అసలు చంద్రబాబు దీనిపై మరో ఆలోచన చేయలేదని, కేసీఆర్ కు కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏ ఒక్క గ్రామాన్ని కూడా తెలంగాణకు బదలాయించేది లేదని కూడా దేవినేని తేల్చిచెప్పారు.