devineni-umaప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వరరావు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. “దేశవ్యాప్తంగా వెల్లడించిన నల్లధనంలో జగన్‌ దే అధిక భాగమని” ఆరోపించారు. హైదరాబాద్‌ నుంచి ప్రకటించిన మొత్తం నల్లదనం సొమ్ములో 10 వేల కోట్ల రూపాయ‌లు వైసీపీ అధినేత‌వేన‌ని వ్యాఖ్యానించారు. జగన్‌ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నాడని, అందుకోసం చట్టాన్ని సైతం అడ్డం పెట్టుకుంటున్నాడ‌ని ఆరోపించారు.

జ‌గ‌న్ అక్ర‌మంగా దాచుకున్న సొమ్ముతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని, జ‌గన్‌ కు బినామీల పేరుతోనూ అనేక ఆస్తులు ఉన్నాయ‌ని దేవినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో వేలాది ఎకరాల భూములు, గ‌నులు ఉన్నాయని అన్నారు. 33,935 కోట్ల విలువైన 94,038 ఎకరాల భూములు జ‌గ‌న్‌ కు బినామీ పేరుతో ఉన్నాయ‌ని, అంతేగాక‌, లక్షా 81 వేల ఎకరాల మేర గనులు కూడా ఉన్నాయని వివ‌రాలు వెల్ల‌డించారు.

కాపుల రిజ‌ర్వేష‌న్ల సాధన పోరాటంలో భాగంగా తునిలో నిర్వ‌హించిన సభ నేప‌థ్యంలో జ‌రిగిన‌ విధ్వంసం కేసులో వైసీపీ పాత్ర త్వరలోనే వెల్ల‌డ‌వుతుంద‌ని అన్నారు. పులివెందుల ప్రాంతానికి నీళ్లు రావంటూ జగన్ ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన దేవినేని, ఆ ప్ర‌చారాన్ని ప‌టాపంచ‌లు చేస్తూ పులివెందులకు నీళ్లిచ్చి అక్కడి ప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.