Devineni Uma comments on jagan governmentటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమ నూతన విద్యావిధానం పేరుతో జగన్‌ సర్కార్ చేస్తున్న ప్రయోగాలను ట్విట్టర్‌లో ఎండగట్టారు. వైసీపీ సర్కార్ చదువులతోను వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వ టీచర్లను కాదని ట్యూషన్ల పేరిట బైజూస్‌తో ఒప్పందం చేసుకొని ట్యాబ్‌లు తయారుచేసే కంపెనీకి రూ.500 కోట్లు లాభం చేకూర్చింది. అంతేకాదు… రాష్ట్రంలో నాలుగు లక్షల మంది విద్యార్ధుల డేటాను జగన్ సర్కార్ ప్రైవేట్ కంపెనీ చేతిలో పెట్టింది. దీనిలో జగన్ సర్కార్‌కి ఎంత కమీషన్ ముడుతోందో? దాని కోసం విద్యార్ధుల భవిష్యత్తుని జగన్ సర్కార్ తాకట్టు పెడుతోందని దేవినేని ఉమ అభిప్రాయం వ్యక్తం చేశారు. నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్‌ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని చెపుతూ దేవినేని ఉమ ట్విట్టర్‌లో మరో సందేశం పోస్ట్ చేశారు.

దానిలో “ఒక్క ఛాన్స్ అంటూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. దోపిడీ, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నేట్టారు. సొంత సంపదను పెంచుకొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలను నిలువునా ముంచేశాడు,” అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి కాళ్ళరిగేలా పాదయాత్ర చేసినందుకు జాలిపడో, లేదా పాదయాత్రలో ఆయన చెప్పిన మాయమాటలు నమ్మో ఏపీ ప్రజలు ఆయనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రి కావాలనే చిరకాలవాంఛను కూడా తీర్చారు. అదీ… భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు! కానీ నా గొప్పదనం చూసే ప్రజలు నన్ను ఎన్నుకొన్నారని, కనుక నా మాటే శాసనం… నేను చేపిందే వేదం అని జగన్ భావిస్తూ పరిపాలన సాగిస్తుండటం వలననే ప్రజలలో ఆయన పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందని చెప్పవచ్చు.

ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వారి ఆకాంక్షల మేరకు పనిచేస్తే, ఇన్ని సంక్షేమ పధకాలు ఈయవలసిన అవసరమూ ఉండేది కాదు. వాటి కోసం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయవలసిన అవసరమూ ఉండేది కాదు. వచ్చే ఎన్నికలలో ప్రజలు వైసీపీకి మళ్ళీ ఓట్లు వేస్తారో లేదో అని భయపడవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ప్రజల ఆకాంక్షల ప్రకారం పనిచేయడం, వారి అంచనాలను అందుకోవడం కంటే సంక్షేమ పధకాల పేరుతో వారిని ప్రలోభపెట్టి ఓట్లు రాల్చుకోవడమే సులువని జగన్మోహన్ రెడ్డి భావిస్తునట్లున్నారు. అందుకే నేడు ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ దుస్థితిలో ఉంది. ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ జగన్ సర్కార్ సద్వినియోగం చేసుకోలేకపోయింది కనుక ఇక గద్దె దిగక తప్పదని దేవినేని ఉమా చెపుతున్నారనుకోవచ్చు.