Devineni Nehru Vs Vangaveeti Mohan Rangaబెజవాడ రాజకీయాల్లో వంగవీటి, దేవినేని కుటుంబాల పాత్ర ప్రధానమైనది. 70, 80 దశకాల నుండి కొనసాగుతున్న ‘వైరం’ నేటీకి రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఈ ఎపిసోడ్ లో అత్యంత కీలకమైన ఘట్టం వంగవీటి మోహన రంగా హత్య ఉదంతం. ఈ ఘటనకు ఎంతటి ప్రాధాన్యం ఉందంటే… అది జరిగి దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా, వర్తమాన రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యత లేని హరిరామజోగయ్య వంటి నేత వ్యాఖ్యానించినా… అది పెను సంచలనంగా మారింది. ఇప్పటికీ బెజవాడ వాసులను ఉద్వేగ పూరితమైన క్షణాలకు గురి చేసే ఆ ఉదంతంపై దేవినేని నెహ్రూ పెదవి విప్పారు.

ఓ మీడియా సంస్థ జరిపిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా తన భావాలు పంచుకున్న దేవినేని నెహ్రూ… “తనకు, రంగా హత్యకు ఎటువంటి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చిందని, అందుకే బుద్ధా వెంకన్నపై పరువు నష్టం దావా వేశానని, ఈ విషయంలో ఎవరు ఆరోపించినా జవాబు ఇలాగే ఉంటుందని” అన్నారు. ‘ఆత్మ’ సాక్షిగా చెప్పాల్సిందిగా సదరు మీడియా ప్రతినిధి కోరగా, అప్పుడు కూడా నెహ్రూ అదే రకమైన సమాధానం వెలిబుచ్చారు. రంగా హత్య కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందంటూ హరిరామ జోగయ్య చేసిన సంచలన ప్రకటనలపై స్పందించిన నెహ్రూ… ఆ సమయంలో చంద్రబాబును మేము అసలు కలుసుకోలేదని, ఈ ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని తానూ భావించడం లేదని వ్యాఖ్యానించారు.

‘దేవినేని’ వర్సెస్ ‘వంగవీటి’ అన్నది రెండు కుటుంబాల మధ్య వైరమే గానీ, రెండు సామాజిక వర్గాల మధ్య కాదని అన్నారు. ‘సి’ బ్యాచ్ పేరుతో బైక్ ల వెనుక ప్రత్యేకంగా 2000 మంది దేవినేని అనుచరులే వేయించుకుని ఎందుకు తిరిగారని ప్రశ్నించగా, ‘నిజానికి అలాంటివి తొలగించాలని మొదట ఆందోళన చేసిందే అవినాష్’ అని చెప్పుకొచ్చారు. బాంబుల సంస్కృతి తనకు తెలియదని, తన ముందు తప్పు జరిగితే ఊరుకోనని, వంగవీటి రంగా 24 మర్డర్ కేసుల్లో ఉన్నారని, తానూ ఒక్క హత్య కూడా చేయలేదని, అయితే రెండు హత్య ఉదంతాలలో తనపై అభియోగాలు ఉన్నాయని, ఒకటి రంగాది కాగా, మరొకటి చంద్రబాబు అధికారంలో నాపై ఆరోపించిందిగా చెప్పారు.

లక్ష్మి పార్వతి ఉదంతాన్ని ఎత్తి చూపుతున్న ప్రతి వారు బహు భార్యత్వం కలిగి ఉన్నారని, కొంత మందికైతే ఎంత మంది ఉన్నారో కూడా తెలియదని, వారి విషయాలన్నీ బయటపెడితే, జనం ముక్కున వేలేసుకుంటారని మండిపడ్డారు. అయితే, దేవినేని నెహ్రూ చెప్పిన సంగతులు విని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బెజవాడ రౌడీ రాజకీయాలు ఎంత పాపులర్ అంటే, చాలా తెలుగు (ముఖ్యంగా వర్మ దర్శకత్వం వహించిన) సినిమాల్లో, మర్డర్ స్కెచ్ లు విజయవాడలో జరిగిన సంఘటనల ఆధారంగానే తీసుకున్నారు. అలాంటి బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన దేవినేని నెహ్రూ కనీసం ఒక్క హత్య కూడా చేయలేదని చెప్పడం ముక్కున వేలేసుకునే అంశమే కదా! నిజమేనంటారా..!? దేవినేని నెహ్రూ అయితే ఆత్మ సాక్షిగా చెప్పారట మరి..!