devineni-avinash-speech-at-vijayawada-meetingభారీ అనుచరగణంతో కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన సందర్భంగా పలువురు కీలక వ్యాఖ్యలు చేయగా, దేవినేని అవినాష్ మాత్రం లోకేష్ ను ఆకట్టుకునే వ్యాఖ్యలు చేసారు. ఓ రకంగా పంచ్ తో లోకేష్ పై ప్రశంసలు కురిపించారు అవినాష్. “పెద్దలందరికీ చంద్రబాబు ‘అన్న’ అయితే, యువతకు మాత్రం లోకేష్ ‘అన్న’తో సమానమని” దేవినేని అవినాష్ వేసిన డైలాగ్ కు సభలో భారీ స్పందన లభించింది. సభా వేదికపై ఉన్న వారి ముఖాలలో నవ్వులు దర్శనమివ్వగా, అభిమానుల నుండి విశేషమైన స్పందన లభించింది.

‘చంద్రబాబు ఉన్నారు కనుక తమ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేదని, మరో 30 ఏళ్లు కృష్ణాజిల్లా గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన అవినాష్, రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని, తాము కూడా సైనికుల్లా పనిచేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉన్నారంటే, చంద్రబాబే కారణమని వ్యాఖ్యానించారు అవినాష్. ఇలా, బాబు, లోకేష్ లపై ప్రశంసలు కురిపించడంలో సక్సెస్ అయిన దేవినేని అవినాష్ ప్రసంగానికి భారీ స్పందన రావడం ఊహించినది మాత్రం కాదు.

అవినాష్ తండ్రి నెహ్రూ మాట్లాడుతూ… “అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారని, రాష్ట్రాభివృద్ధికి పాటు పడుతున్న చంద్రబాబు నాయుడును ఎవరూ అడ్డుకోలేరని, రాష్ట్ర ప్రజలే ఆశలే ఊపిరిగా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారన్నారని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే అయితే, తనకు మంత్రి పదవి దక్కడంలో కీలకపాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు” అని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. టీడీపీ అంటే తనకు ఎనలేని అభిమానమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆనాడు పార్టీ మారాల్సి వచ్చిందని, తాను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ, మధ్యలో పార్టీ మారినా చివరకు తిరిగి టీడీపీలోనే చేరుతున్నట్లు నెహ్రూ పేర్కొన్నారు.

ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ… ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికిన మొదటి వ్యక్తి దేవినేని నెహ్రూ అని, మాటకు కట్టుబడే వ్యక్తి అని, నెహ్రూతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చెయ్యాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని, ప్రపంచంలోనే మేటైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, ఏపీ ప్రజలే తన ఊపిరని రాష్ట్ర పరిస్థితులను గురించి ప్రసంగించారు.