Devineni Avinash contesting from Gudivadaకృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోటీ చేయించే అంశాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కొడాలి నాని తెదేపా అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న తెదేపా అవినాష్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మక ప్రయోగం చేయాలని భావిస్తోంది. అవినాష్ కు ఈ సీటు కంఫర్మ్ అయిపోయినట్టే సమాచారం.

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్‌ 1983, 85 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి సుమారు 50 వేల మెజారిటీతో గెలుపొందారు. 2004 ఎన్నికలలో టీడీపీ తరపున మొదటి సారి గెలిచారు కొడాలి నాని. 2009 ఎన్నికలలో కూడా గెలిచారు. అయితే ఆయన ఆ తరువాతి కాలంలో 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని తూలనాడటం మొదలు పెట్టారు. దాదాపుగా రోజాకి సమానంగా చంద్రబాబును, లోకేశ్ ను విమర్శించిన వారెవరైనా ఉంటే అది నానినే.

అయితే విజయవాడ నుండి వచ్చిన అవినాష్ గుడివాడలో ఏ మేరకు రాణించగలరు అనేది చూడాలి. పైగా ఇప్పుడు టిక్కెట్ నిరాకరింపబడ్డ స్థానిక నేతలు ఆయనకు సహకరిస్తారా అనేది కూడా ప్రశ్నర్ధకమే. అయితే 2004 నుండి ఎమ్మెల్యేగా ఉన్న నాని ప్రతీ సారీ ప్రతిపక్షంలోనే ఉన్నారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండటంతో సహజంగానే ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. చూడాలి దీనిని అవినాష్ ఎంతవరకూ వాడుకోగలరో?