Mahesh-Babu-25th-Movie-Launch-ప్రిన్స్ మహేష్ బాబు మొదటి సినిమా ‘రాజకుమారుడు’ మొదలుకుని ‘ఖలేజా’ వరకు నటించిన 15 సినిమాలలో 11 చిత్రాలకు గానూ సంగీతం అందించిన ఘనతను ‘మెలోడీ బ్రహ్మా’ మణిశర్మ సొంతం చేసుకున్నారు. ఒకానొక సమయంలో మహేష్ సినిమా అంటే మణిశర్మ ఒక్కరే కొట్టాలి అన్న నానుడి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యిందంటే… వారిద్దరి మధ్య ఎంత సఖ్యత నెలకొందో ఆశ్చర్యపడనవసరం లేదు. అయితే ‘ఖలేజా’ తర్వాత మణికి దూరంగా థమన్ కు 2, మిక్కీ జే మేయర్ కు 2 అవకాశాలు కల్పించిన ప్రిన్స్, ప్రస్తుతం ‘స్పైడర్’ ద్వారా హారిస్ జయరాజ్ కు కూడా రెండో అవకాశాన్ని ఇచ్చారు.

ఇదిలా ఉంటే మహేష్ నటించబోతున్న తదుపరి సినిమా “భరత్ అనే నేను”కు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నేడు ప్రారంభమైన వంశీ పైడిపల్లి సినిమాకు కూడా దేవినే స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకున్న ఈ సినిమాకు ముందుగా గోపి సుందర్ గానీ, థమన్ గానీ సంగీతం అందిస్తారన్న టాక్ హల్చల్ చేసింది. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ… నేడు జరిగిన పూజా కార్యక్రమ వేడుకలో దేవిశ్రీప్రసాద్ పాల్గొనడంతో ప్రిన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మణిశర్మ తర్వాత ప్రిన్స్ అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన దర్శకుడిగా నిలిచాడు దేవి.

‘1 నేనొక్కడినే’ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ తో ప్రారంభమైన వీరి ప్రస్థానం, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూసినప్పటికీ, ‘శ్రీమంతుడు’ ద్వారా ‘నాన్ బాహుబలి’ రికార్డులను సొంతం చేసుకున్న కాంభినేషన్ గా మారింది. 2019 జనవరి 11వ తేదీన విడుదల కాబోతున్న “భరత్ అనే నేను” సినిమాతో హ్యాట్రిక్ ఆల్బమ్ ను ముగించనున్న దేవి, వంశీ పైడిపల్లి సినిమాతో మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ 1 సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న దేవి చేతిలోకే అగ్ర హీరోల సినిమాలన్నీ వెళ్తున్నాయి.