Development Telangana Vs Andhra Pradeshతెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఐటీ-హబ్‌లు, సాఫ్ట్‌వేర్‌ పార్కులు, వైద్య పరికరాలకు మెడికల్ డివైజస్ పార్కు, చిన్న, పెద్ద పరిశ్రమలకు వేర్వేరుగా ఇండస్ట్రియల్ పార్క్‌లు, టెక్స్‌టైల్‌ పార్కులు, రవాణా కోసం లాజిస్టిక్ పార్కులు వంటివి ఏర్పాటు చేస్తూ, పరిశ్రమలకు మంచి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తుండటంతో నెలకు సగటున రూ.250 కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు వస్తున్నాయి.

ఇందుకు తాజా ఉదాహరణగా వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు కాబోతున్న ప్రముఖ వస్త్ర పరిశ్రమ కిటెక్స్ కంపెనీ గురించి చెప్పుకోవచ్చు. రూ.1,200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీకి తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేడు శంఖుస్థాపన చేశారు.

ఈ ఒక్క కంపెనీ ద్వారానే 11,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఒక్క టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటవుతున్న కంపెనీలతోనే వేలాదిమందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. హైదరాబాద్‌ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో ఇప్పటికే పలు ఐ‌టి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఇంకా అనేక కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఐ‌టి కంపెనీల ద్వారా వరంగల్‌లోనే సుమారు 50, 000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి,” అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల రాజకీయాలు ఏవిదంగా ఉన్నప్పటికీ ఐ‌టి, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, మౌలికవసతుల రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అమెజాన్ వెబ్‌ సర్వీసస్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా రూ.20,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతోంది.

తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటే ఏపీలో ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపులు, మీడియాలో అధికార పార్టీ నేతల బూతుపురాణాలు, అప్పు చేసి పప్పు కూడు అన్నట్లు సంక్షేమ పధకాల గురించి మాటలే వినబడుతుంటాయి తప్ప ఈవిదంగా రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి మాటలు వినబడవు. అది వారి అదృష్టం… ఇది మన అదృష్టం అని ఏపీ ప్రజలు సరిపెట్టుకోక తప్పదు.