KTR-and-Jagan- Development in Two Telugu States అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల గమనం సాగుతోంది. అందులో తెలంగాణా ఒక దిశలో పయనిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మరో దిక్కులో సాగుతోంది. అవును… ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ లో మంత్రి కేటీఆర్ చెప్పినట్లు హైదరాబాద్ అనేది దేశానికే సినీ రాజధానిగా అవతరిస్తోంది.

ఒకప్పుడు దక్షిణాదిలో షూటింగ్ చేయాలంటే సరైన సదుపాయాలు లేవని బాలీవుడ్ వర్గాలు పెదవి విరిచే పరిస్థితి. కానీ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తెలుగు సినీ పరిశ్రమ అంచలంచెలుగా ఎదిగి, నేడు భారతీయ చలన చిత్ర పరిశ్రమకే ఓ హబ్ లా మారింది. అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలు ఇస్తూ సినీ పరిశ్రమను ఉత్సాహపరుస్తోంది.

ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో ఒక్క తెలుగు సినిమా షూటింగ్ లే కాదు, ప్రముఖ బాలీవుడ్ సినిమాలన్నీ కూడా హైదరాబాద్ లో షూటింగ్ లు నిర్వహిస్తున్నారు. అందుకు అనేకానేక కారణాలు ఉండొచ్చు. కానీ వాటిని అడ్డుకునే విధంగా గానీ, సినీ పరిశ్రమ వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా ఏ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

దీంతో కేటీఆర్ చెప్పినట్లుగా హైదరాబాద్ అనేది సినీ పరిశ్రమకు రాజధానిగా అవతరిస్తోంది. కానీ మరో తెలుగు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటయ్యా అంటే… అసలు రాష్ట్రానికే రాజధాని లేని దుస్థితి నెలకొంది. ఏపీలో మీ రాజధాని పేరేంటి? అని ఏ ఒక్కరినైనా అడిగితే, సిగ్గుతో తల దించుకునే పరిస్థితి తప్ప, పలానా నగరం తమ రాజధాని అని చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది.

రాజధానియే సరిగా లేని రాష్ట్రానికి వచ్చి షూటింగ్ లు చేయమని సినీ పెద్దలను ప్రభుత్వ వర్గాలు నిర్ధేశించడం, ఒత్తిడి చేయడం మరింత శోచనీయం. షూటింగ్ ల మాట పక్కన పెడితే, అసలు రాజధాని నిర్మించే ఉద్దేశం లేదనే విధంగా ఏపీలో పాలన కొనసాగుతోంది. మూడేళ్లు కావస్తున్నా, ఏ మాత్రం చలనం లేకుండా మూడు రాజధానుల పాటను ఇంకా పాడుతుండడం విస్తుపోయే అంశం.

కనీసం తీసుకున్న నిర్ణయం పైన అయినా నిక్కచ్చిగా నిలబడ్డారా? అంటే రెండున్నర్రేళ్ళు ముగిసే సమయానికి వెనక్కి తీసుకున్న పరిస్థితి నెలకొంది. అలాగని చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అది కూడా లేదు. అప్పులకు మాత్రం అమరావతి భూములను అడ్డం పెట్టుకుంటున్నారు గానీ, అభివృద్ధికి మాత్రం ఆస్కారం కల్పించడం లేదు.

విభజన తర్వాత తెలంగాణా ఏమో ప్రగతి పధంలో దూసుకుపోతూ, దేశంలోనే రెండవ రాజధానిగా ఎదుగుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఏమో ఎనిమిదేళ్లు గడిచినా రాజధాని కోసం వెతుకులాట సాగిస్తోంది. పాలకులు సరైన నిర్ణయాలు తీసుకుంటే హైదరాబాద్ లాంటి రాజధాని రూపొందుతుందని, అదే పాలకులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాజధాని లేని ఏపీలా మారుతుందని చెప్పడానికి రెండు తెలుగు రాష్ట్రాలు చక్కటి నిదర్శనాలుగా తారసపడుతున్నాయి.