Development in Telanganaభారత్‌, పాక్ దేశాలకు ఒకేసారి స్వాతంత్ర్యం వస్తే భారత్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ అంతరిక్షస్థాయికి దూసుకుపోతోంది. పాక్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ఆ దేశ పాలకుల స్వార్ధం, అవినీతి, అసమర్దత, అనాలోచిత నిర్ణయాలు, భారత్‌పై ద్వేషంతో ఉగ్రవాద సర్పాన్ని పెంచి పోషిస్తుండటం వంటి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే పాక్ పాలకుల వైఖరిలో నేటికీ మార్పు రావడం లేదు. కనుక ఆ దేశం నానాటికీ దయనీయస్థితికి దిగజారిపోతోంది.

ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను చూస్తే ఇంచుమించు అదేవిదంగా కనిపిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ 2014, జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయి. భారత్‌, పాక్ విభజన తర్వాత రెండు దేశాలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాయో, ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆవిదంగానే విభజన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొన్నాయి.

అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి సమర్దులైన ముఖ్యమంత్రులు పగ్గాలు చేపట్టినందున ఇద్దరూ అతి తక్కువ కాలంలోనే ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకొంటూ ముందుకుసాగి అభివృద్ధిలో పోటీ పడ్డారు. అయితే మూడేళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు రాజకీయంగా వేసిన కొన్ని తప్పటడుగులు ఆయనకి, టిడిపికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా శాపంగా మారాయి.

టిడిపి అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ సిఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం నిర్ణయాలను యదాతధంగా కాకపోయినా మార్పులు చేర్పులతో కొనసాగించినా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ దుస్థితి కలిగి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ చంద్రబాబు నాయుడిపై ద్వేషంతో గత ప్రభుత్వం తీసుకొన్న ప్రతీ నిర్ణయాన్ని, మొదలుపెట్టిన ప్రతీ పనిని పక్కనపడేసి ప్రతీకారం, విద్వేషం, సంక్షేమం, అప్పులే విధానంగా చేసుకొని పాలన సాగిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇప్పుడు శాపగ్రస్త రాష్ట్రంగా మారిపోయింది.

కానీ తెలంగాణలో ప్రజలు కేసీఆర్‌ రాజకీయాలను పట్టించుకోకుండా ఆయన పరిపాలనను, ఎంతో దూరదృష్టితో తీసుకొంటున్న నిర్ణయాలను, వాటి అద్భుత ఫలితాలను కళ్ళారా చూసి మళ్ళీ ఆయనకే పట్టం కట్టారు. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఈ 8 ఏళ్ళ స్వల్ప కాలంలోనే దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలిచింది. యావత్ ప్రపంచదేశాలను కూడా ఆకర్షిస్తోంది.

అందుకు తాజా నిదర్శనమే అమెరికాకు చెందిన అమెజాన్ వెబ్‌ సర్వీసస్ సంస్థ హైదరాబాద్‌లో రూ.36,300 కోట్లు పెట్టుబడి పెడుతుండటాన్ని చెప్పుకోవచ్చు. ఆ ఒకే ఒక కంపెనీ ద్వారా ఏకంగా 48,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. గత ప్రభుత్వం అతి కష్టం మీద అంతర్జాతీయ లోదుస్తుల తయారీ కంపెనీ ‘జాకీ’ని అనంతపురంలోని రాప్తాడు తీసుకువస్తే అది మన ప్రభుత్వానికి దణ్ణం పెట్టి తెలంగాణకి వెళ్ళిపోయి, అక్కడ రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తోందిప్పుడు. దానిలో 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

తెలంగాణకు పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఏపీకి రావడం లేదు ఎందుకు? వచ్చినవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు?అంటే అందరికీ తెలుసు.

తెలంగాణ రాష్ట్రం గుండానే కృష్ణగోదావరి నదులు పారుతూ ఏపీకి వస్తాయి. కానీ అక్కడ ఎత్తిపోతల పధకాలతో మాత్రమే నీటిని వాడుకోగలరు. కనుక తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టు కట్టుకొని ఎక్కడికక్కడ డ్యాములు, రిజర్వాయర్లు కట్టుకొని కావలసినంత నీటిని అన్ని జిల్లాలకు అందిస్తూ దశాబ్ధాలుగా ఎండిపోయిన బీడు భూములను సశ్యశ్యామలం చేసి దేశానికే ధాన్యాగారంగా మారింది. ఏపీలో సహజసిద్దంగా నీరు పారుతుంటుంది కనుక ఎత్తిపోతలు అవసరం చాలా తక్కువ. అయినా రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఎందుకు?

తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఐ‌టి, పరిశ్రమలే కాదు వైద్యరంగం కూడా నభూతో నభవిష్యతి అన్నట్లు అంతర్జాతీయస్థాయికి ధీటుగా ఎదుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నలుదిక్కులా నాలుగు అంతర్జాతీయస్థాయి హాస్పిటల్స్ నిర్మిస్తోంది. వరంగల్‌లో 14 అంతస్తులతో మరో అంతర్జాతీయస్థాయి హాస్పిటల్స్ నిర్మిస్తోంది. ప్రతీ జిల్లాకు ఓ ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటుచేసుకొంటోంది. ఎక్కడికక్కడ ఉచిత డయోగ్నెస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలు, పరీక్షలు అందిస్తోంది. తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పుకోవాలన్నా, ఆంధ్రప్రదేశ్‌ దుస్థితి గురించి చెప్పుకోవాలన్నీ పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. చెప్పుకోవలసినవి అన్ని ఉన్నాయి. చివరిగా ఒకే ప్రశ్న… ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంత తేడా ఎందుకు ఏర్పడింది?