deputy cm narayana swamyచర్చలకు రాకుండా జగన్ సర్కార్ పై ఉద్యోగ సంఘాలు చేస్తోన్న నిరసనల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగులు గౌరవించాలని, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు చెడుగా మాట్లాడితే ఎలా? అంటూ హితవు పలికారు. ముఖ్యమంత్రిపై ఉపాధ్యాయులు వాడుతోన్న భాష సరిగా లేదంటూ మండిపడ్డారు.

ఓ పక్కన ప్రభుత్వం నుండి 70 వేలు, లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తున్నారని ఆరోపించారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్ లోనే మీ పిల్లలను కూడా చదివించవచ్చు కదా అంటూ నిలదీశారు. ఏపీ డిప్యూటీ సీఎం చేసిన ఈ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో చైర్మన్ సుధీర్ బాబు ధీటైన జవాబునిచ్చారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలలో సగం మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని, మరి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిల్లలు, మనవళ్లు ఎక్కడ చదివారు? అంటూ ప్రశ్నించారు. పీఆర్సీ సమస్యను పరిష్కరించలేక వైసీపీ మంత్రులు డ్రామాలు ఆడుతున్నారని, ఆ స్థానంలో ఉన్న వారు మరింత బాధ్యతగా మెలగాలని హితవు పలికారు.

ఓ పక్కన తాము పీఆర్సీ గురించి పోరాడుతుంటే, దానితో సంబంధం లేకుండా మరో అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి సమస్యను డైవర్ట్ చేయడం డిప్యూటీ సీఎంకు తగదని ఫ్యాప్టో ప్రతినిధి హృదయరాజ్ కూడా స్పందించారు. ఒకవేళ అదే చేయాలనుకుంటే, కార్పొరేట్ స్కూల్స్ లేని వ్యవస్థను ఈ ప్రభుత్వం తీసుకువస్తుందా? అంటూ నిలదీసారు.

అయినా వైసీపీ మంత్రి అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఏదో ఉద్యోగులను కార్నర్ చేద్దామని పిల్లల ఊసెత్తారు గానీ, ఆ వ్యాఖ్యలలో ఏమైనా పస ఉందా? ఉద్యోగుల పిల్లల గురించి ప్రస్తావిస్తే, ప్రత్యర్థి వర్గాలు కూడా ఆటోమేటిక్ గా అవే కౌంటర్లను తిరిగి వేస్తుందన్న చిన్న లాజిక్ ను వైసీపీ మంత్రివర్యులు నారాయణస్వామి మరచినట్లున్నారు.