Deputy Chief Minister Rajanna dora gadapa gadapaku programఅవును. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాలు ల గురించి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకొంటున్నా, ప్రతీ పధకానికి జగనన్న పేరు తగిలిస్తున్నా, వాటిని వాలంటీర్లే ఇస్తున్నారని చెప్పడం విని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మొదట షాక్ అయ్యారు. తరువాత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సాలూరులో జరిగింది.

ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర శనివారం సాలూరు పట్టణంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఓ ఇంటికి వెళ్ళి తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల జాబితా చదివి వినిపించి “అమ్మా.. వీటిలో నీకు ఏమైనా సంక్షేమ పధకాలు అందుతున్నాయా?” అంటూ ప్రశ్నించారు.

దానికి ఆమె “ఆ..అందుతున్నాయి సార్…వాలంటీర్ అన్నీ ఇస్తున్నాడు,” అని సమాధానం చెప్పడంతో రాజన్న దొర మొదట షాక్ అయ్యారు. తరువాత తేరుకొని “అదేమిటమ్మా… ఇదివరకు సంక్షేమ పధకాలు ఇస్తే చంద్రన్న ఇచ్చాడు అని చెప్పేవారు కదా? ఇప్పుడు జగనన్న ఇస్తుంటే వాలంటీర్ ఇస్తున్నాడని చెపుతావేమిటి?పధకాలు మన జగనన్న ఇస్తున్నాడని చెప్పొచ్చు కదా?” అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

తరువాత పక్కనే ఉన్న అధికారులపై ఆ కోపం ప్రదర్శిస్తూ “వాలంటీర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా ప్రజల వద్దకు పంపిస్తే ఎలా?అసలు వాలంటీర్లకు మన పధకాల గురించి తెలుసా లేదా? ఇవాళ్ళ సాయంత్రం వాలంటీర్లతో మీటింగ్ ఏర్పాటు చేయండి. నేనే వారిని సంక్షేమ పధకాల గురించి ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానాలు చెప్పకపోతే సస్పెండ్ చేస్తాను,” అంటూ చిందులు వేశారు.