demonetization-black-money-collected-rbiపెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వానికి హీనపక్షంగా ఓ రెండు, మూడు లక్షల కోట్లు మిగులుతాయని అంచనా వేసిన మాట అక్షర సత్యం. ఒక్క ప్రభుత్వమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఈ విషయాన్ని విశ్వసించారు. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది బలిదానం అయినా 50 రోజుల పాటు క్యూలో నిల్చుని, ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. తీరా 50 రోజులు పూర్తయ్యేపాటికి జరిగింది ఏమిటి అంటే… ప్రభుత్వానికి, సామాన్య ప్రజల ఆలోచనలకు నల్లకుభేరులు ఓ రేంజ్ లో షాక్ ఇచ్చే విధంగా తమ డబ్బునంతా విజయవంతంగా బ్యాంకులకు చేర్చగలిగారు.

ఈ పర్యవసానాల ప్రభావమే, డిసెంబర్ 30వ తేదీతో పాత నోట్లు డిపాజిట్లు ముగిసినా… ఇప్పటివరకు ఎంత మొత్తం బ్యాంకులకు చేరింది అన్న విషయాన్ని ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ అధికారికంగా ప్రకటించలేకపోతోంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నోట్ల రద్దు ‘బూమ్ రాంగ్’ కావడంతో, ప్రస్తుతం డిఫెన్సులో పడినట్లు స్పష్టంగా కనపడుతోంది. జనవరి 1వ తేదీ నుండి ‘బినామీలపై సునామీ’ అంటూ వీరోచితమైన వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సైతం, ప్రస్తుతం పెదవి విప్పడానికి ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి.

50 రోజులు ఓపిక పట్టండి… మీ భవిష్యత్తును మార్చేస్తాను అని చెప్పిన ప్రధాని గమనాన్ని నల్లకుభేరులు శాసించే విధంగా ఈ 50 రోజుల్లో కరెన్సీ కట్టలు బ్యాంకులకు చేరాయన్నది అసలు న్యూస్. రద్దయిన 15.44 లక్షల కోట్లల్లో కేవలం ఓ 50 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి మిగిలే విధంగా నగదు డిపాజిట్లు అయినట్లుగా సదరు సంస్థలు బల్లగుద్ది చెప్తున్నాయి. 95 శాతంకుపైగా రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరుకుంటే, చేసిన కార్యం సఫలీకృతం అయినట్లో లేక పరాభవం చెందినట్లో అన్న విషయం ప్రభుత్వమే ఆలోచించుకోవాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దీనిపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బహుశా ఏ రెండు, మూడు లక్షల కోట్లు మిగిలినట్లయితే, ఈ పాటికి మోడీ సర్కార్ ఈ విషయాన్ని మీడియాల ద్వారా ఖచ్చితంగా ఊదరగొట్టి ఉండేది. కానీ, అంచనాలు తారుమారు కావడంతో… కనీసం మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదు. మరి ఆర్బీఐ గానీ, ప్రభుత్వం గానీ ఈ లెక్కలను ఎప్పుడు అధికారికంగా బయటపెడుతుందోనని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.