demonetisation  Was not Necessary, Says Former PM Manmohan Singhగతేడాది నవంబరులో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు తప్పుబట్టారు. మొహాలీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్‌ లో మాట్లాడిన మన్మోహన్… నోట్ల రద్దుపై మరోమారు సునిశిత విమర్శలు చేస్తూ… దీనిని నిరర్థక సాహసంగా అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమంలోకి వెళ్లిపోయిందని, ఆర్థికంగా, సాంకేతికంగా… ఇలా ఏ విధంగా చూసినా ఈ ‘సాహసం’ వల్ల ఉపయోగం లేకుండా పోయిందని చెప్పారు.

లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాల్లో తప్ప ఏ నాగరిక ప్రపంచంలోనూ నోట్ల రద్దు విజయవంతం కాలేదని మన్మోహన్ పేర్కొన్నారు. చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగిందన్నారు. నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ల వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉండే అవకాశం ఉందని, తాత్కాలికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని వాటిని అధిగమించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 1990లలో సంస్కరణలకు బీజం వేసి, ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ రీఫామ్స్’గా పేరు తెచ్చుకున్న మన్మోహన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది.