Demonetisation - No more exchange of Rs 500 and Rs 1000 notesనల్లకుభేరుల అంతు చూసేందుకు నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ ఆ దిశగా వేస్తున్న అడుగులు, బ్లాక్ మనీ రాయుళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటివరకు పుకార్లుగా భావించిన మరో కార్యాన్ని అమలు చేసి, నల్లకుభేరులకు షాక్ ఇచ్చింది. నోట్ల రద్దు ప్రకటన వచ్చిన 8వ తేదీ నుండి ఇప్పటివరకు క్యూ లైన్లలో నిల్చుని పడిగాపులు పడుతోన్న జనాలు అంతా సామాన్యులేనని, మోడీ తలపెట్టిన నల్లకుభేరులు ఒక్కరు కూడా బయటకు రాలేదని, వారంతా వేచిచూసే ధోరణిలో ఉన్నారని విమర్శలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో… కేంద్రం మరో కీలక అడుగు వేసింది.

బ్యాంకు కౌంటర్ల వద్ద పాత నోట్ల మార్పిడిని రద్దు చేయడమనే అత్యంత కీలకమైన నిర్ణయం వైపు మోడీ సర్కార్ అడుగులు వేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రక్రియతో నోట్ల మార్పిడి పూర్తిగా రద్దు కావడంతో… ఇక నుండి డబ్బులు మార్చుకోవాలంటే వ్యక్తిగత ఖాతాలు అనివార్యం కానుంది. ఏం జరుగుతుందో… వేచిచూద్దాం… అన్న ఆలోచనలు చేసిన వారికి ఒక విధంగా ఇది షాకింగ్ లాంటి నిర్ణయం అని చెప్పవచ్చు. ఇప్పుడు అలర్ట్ అయినా… పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు.

ఎందుకంటే… సేవింగ్స్ ఖాతాలో కేవలం 2.50 లక్షలకు మించి డబ్బులు జమ చేస్తే, వాటికి లెక్క చెప్పాల్సి ఉంటుందన్న నిబంధనతో, కొత్త ఖాతాలు తెరిచినా, 2.50 లక్షలకు మించి డబ్బులు జమ చేయడానికి అవకాశం లేదు. దీంతో ఇప్పటివరకు నల్ల సామ్రాజ్యంలో మూలుగుతూ ఉన్న సొమ్ము పరిస్థితి ఏంటా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి దీనికి సంబంధించిన సిగ్నల్స్ ను కేంద్రం ఒక వారం ముందే ఇచ్చినప్పటికీ, పుకార్లను నమ్మవద్దని చెప్పడంతో, డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ నోట్ల మార్పిడి ఉంటుందని భావించారు.

అయితే నల్లకుభేరులకు కొంతలో కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే… రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కేంద్రాల వద్ద మాత్రం ఈ పాత నోట్ల మార్పిడి డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఈ విషయాన్ని సామాన్యుల్లోకి కూడా తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే ఖాతాలు లేని సామాన్య ప్రజానీకం డబ్బులు కూడా వృధా అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. మొత్తమ్మీద విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రధాని మోడీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా, మరిన్ని కఠినతరమైన నిబంధనల దిశగా అడుగులు వేయడం హర్షించదగ్గ విషయం.