Demonetisation effect online hackers‘క్యాష్ లెస్’ ఇండియాలో భాగంగా కరెన్సీ నోట్లకు బదులు ‘ప్లాస్టిక్ కరెన్సీ’ని వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. దేశానికి కరెన్సీ తెచ్చిపెట్టే విధానంగా భావించే నగదు రహిత లావాదేవీల విషయం బాగానే ఉంటుంది. అయితే సైబర్ క్రైమ్ లకు ఎవరు సమాధానం చెప్తారు? రోజూ వందల సంఖ్యలో జరుగుతోన్న హ్యాకింగ్ లను ఎవరు నియంత్రణ చేస్తారు? ఇదే ప్రజల నుండి వస్తున్న సూటి ప్రశ్న.

ఉదాహరణకు పెద్ద నోట్లను రద్దు చేసిన మరుక్షణం… ఆన్ లైన్ చెల్లింపులలో భాగంగా చాలా మంది ‘పేటీఎం’ వైపు మొగ్గుచూపి పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న యూజర్ల సంఖ్య ఒక్కసారిగా పుంజుకోవడంతో, కొన్ని కోట్ల విలువైన లావాదేవీలు పేటీఎం ద్వారా జరిగాయి. అయితే ఇంతలోనే షాకింగ్ న్యూస్. పేటీఎంపై కన్నేసిన హ్యాకర్లు ఏకంగా 2.50 లక్షల మంది ఖాతాదారుల డేటాను దొంగిలించారన్న వార్త వినియోగదారులను సందేహంలో పడేసింది.

ఈ హ్యాకింగ్ పై పేటీఎం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు గానీ, సదరు సమాచారం మాత్రం లావాదేవీలు జరిపిన వారిలో కలకలం రేపుతోంది. ఓ పక్కన ఆన్ లైన్ లావాదేవీలు జరపండి అంటూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెప్తోంది. ఆన్ లైన్ విధానాన్ని అనుసరించే శాతం 20కి మించదు. మరి ఈ చిన్న లావాదేవీలకే ఈ రేంజ్ లో హ్యాకర్లు విరుచుకుపడుతుంటే… రేపు 90 శాతం లావాదేవీలు ‘ప్లాస్టిక్ మనీ’ ద్వారానే జరపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు హ్యాకర్లు వరంగా మారబోతున్నాయా? అన్న ప్రశ్నలను ప్రజలకు మిగులుస్తోంది.