Dell-Data-Center-in-Andhra-Pradeshఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ డెల్ నవ్యాంధ్రకు వచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. డల్లాస్ లో ఉన్న డెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కాగా, ఏపీలో డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు డెల్ సిద్ధంగా ఉందని సదరు సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ సత్య స్పష్టం చేశారు.

అంతకుముందు డల్లాస్ లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి, ఆపై హెలికాప్టర్ల తయారీ సంస్థ బెల్ డైరెక్టర్ చాద్ స్పార్క్ తో భేటీ అయ్యారు. ఏపీలో మాన్యుఫాక్చరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా, పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆకర్షణీయమైన పౌరవిమానయాన విధానాన్ని తీసుకొచ్చామని, మరిన్ని వివరాల కోసం రాష్ట్రానికి రావాలని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించారు చంద్రబాబు.

అంతకుముందు దిగ్గ‌జ సంస్థ‌ ఆపిల్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విల్లియమ్స్ తో భేటీ అయి, ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోన్న భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని, రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే అద్భుత అవకాశమ‌ని, మంచి ఉత్పాదక సామర్థ్యం ఉన్న యువతను ఏపీ కలిగి ఉంద‌ని, ఆపిల్ సంస్థ కాలుమోపేందుకు అన్ని అనుకూలతలూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయ‌ని విల్లియమ్స్ కు వివ‌రించారు చంద్ర‌బాబు.