Delhi-MCD-Election-Resultsయావత్ దేశాన్ని కనుసైగతో శాశిస్తున్న బిజెపి పెద్దలకి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, ఆమాద్మీ (సామాన్యుడు) పార్టీ కొరకరాని కొయ్యలుగా నిలుస్తున్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమాద్మీ విజయం సాధించింది. ఢిల్లీ కార్పొరేషన్‌లో మొత్తం 250 వార్డులు ఉండగా వాటిలో 126 ఆమాద్మీ గెలుచుకొంది. మరో నాలుగు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

దీంతో దశాబ్ధ కాలంగా బిజెపి చేతిలో ఉన్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ని మేయర్ పీఠాన్ని ఆమాద్మీ గెలుచుకొంది. ఈ ఎన్నికలలో బిజెపి కూడా గట్టిపోటీ ఇచ్చి 101 సీట్లు గెలుచుకొంది కానీ మేయర్ పీఠాన్ని చేజార్చుకొంది. అంతకు ముందు మూడు దశాబ్దాలపాటు ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈ ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్‌కి కేవలం 8 సీట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఢిల్లీలోనే ఉంటారు. కానీ అక్కడే గెలవలేకపోతే మరెక్కడ గెలవగలదనే సందేహం కలగడం సహజం.

గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ కూడా పోటీ చేసింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం రెండు రాష్ట్రాలలో మళ్ళీ బిజెపియే అధికారంలోకి వస్తుందని తేలడంతో తీవ్ర నిరాశకి గురైంది. కానీ బిజెపి చేతిలో ఉన్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ని స్వాధీనం చేసుకోవడంతో ఆమాద్మీ పార్టీ చాలా సంతోషంగా ఉన్నారు.

అయితే ఆమాద్మీ సంతోషం ఎంతో కాలం నిలువకపోవచ్చు. బిజెపి 101 సీట్లు గెలుచుకొంది కనుక తప్పకుండా ఆమాద్మీ వార్డు మెంబరులను నయన్నో భయన్నో లొంగదీసుకొని వారి సహకారంతో మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు తప్పకుండా ప్రయత్నించవచ్చు.