delhi-polls-time-for-bjp-to-relinquish-communal-agendaఅరవింద్ కేజ్రీవాల్ ని గద్దె దించడానికి సర్వశక్తులు ఒడ్డింది బీజేపీ. మందీమార్బలాన్ని మొత్తంగా ఢిల్లీలో మోహరించినా పట్టుమని 10 సీట్లు కూడా సాధించలేకపోయింది. కొన్ని నెలల ముందు ఇదే రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఢిల్లీలో ఉన్న ఏడు సీట్లలో ఏడూ గెలుచుకోవడం గమనార్హం.

కేవలం ఎనిమిది నెలలో పరిస్థితి తారుమారు అయిపోయింది. అయితే బీజేపీ మీద జాతీయ స్థాయిలో అంత వ్యతిరేకత వచ్చిందా అంటే అదీ లేదు. స్థానిక అంశాలకు, స్థానిక నాయకత్వానికి ప్రజలు ఈ ఎన్నికలలో పట్టం కట్టగా, ఆ విషయాలలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యింది. సీఏఏ, ఆర్టికల్ 370, అయోధ్య వంటి జాతీయ అంశాలతో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది.

సరైన సీఎం అభ్యర్థిని ముందు పెట్టకుండా మోడీనే తమ జెండా అజెండా అన్నట్టు ముందుకు వెళ్ళింది. ఓటమి మూటగట్టుకుంది. దీనిని నుండి అన్ని రాష్ట్రాలలో బీజేపీ మేల్కొనాల్సిన పరిస్థితి. మోడీ ఫొటో తో రాజకీయాలు చేస్తాం అంటే ప్రజలు మోడీ మాకు సీఎంగా రారు కాదా అని తమ దారి తాము చూసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర యూనిట్లు ఇప్పటివరకూ అదే డైరెక్షన్ లో ముందుకు పోతున్నాయి. తమ వైఖరి మార్చుకోకపోతే ఏమవుతుందో తెలియడానికి ఢిల్లీ ఫలితాలే నిదర్శనం. ఈ విషయం ముందు మోడీ అమిత్ షాలు తెలుసుకోవాలి… ఆయా రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలియజెప్పాలి.